9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్
శాఫ్ ఫుట్ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో స్కోరుతో సమం కాగా, పెనాల్టీ షూటౌట్‌లో ఇండియా 5-4 తేడాతో నెగ్గింది. భారత్ తరుపున లాలియస్ జులా 39వ నిమిషంలో ఒక గోల్ చేయగా, కువైట్ తరుపున 14వ నిమిషంలో షబీబ్ అల్ ఖల్దీ ఓ గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దీంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
శాఫ్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సునిల్ ఛెత్రి
షూటౌట్‌లో నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 4-4తో సమానంగా నిలిచాయి. ఆరో షాట్‌లో భారత్ తరుపున మహేష్ సింగ్ గోల్ చేయగా, కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్ ను భారత్ గోల్ కీపర్ గుర్ ప్రీత్ సింగ్ అడ్డుకున్నాడు. దీంతో భారత్ గెలుపొందింది. శాఫ్ ఛాంపియన్‌షిప్ 13సార్లు జరగ్గా, ఇందులో భారత్ తొమ్మిది సార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్‌ను ఎగరేసుకొని పోయింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.41 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన కువైట్ జట్టుకు రూ.20.5లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. అదే విధంగా శాఫ్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సునీల్ ఛెత్రి(24) అవతరించాడు.