Year Ender 2024: ఈ ఏడాది భారత క్రీడలలో అద్భుత ఫలితాలు,వివాదాలపై .. ఓ లుకేద్దాం..!
భారత క్రీడా ప్రపంచంలో 2024 సంవత్సరం అద్భుతంగా గడిచింది. చెస్, షూటింగ్, రెజ్లింగ్, పారాలింపిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ వంటి వివిధ క్రీడా రంగాల్లో భారత ఆటగాళ్లు అనేక అద్భుత ఫలితాలను సాధించారు. అయితే, అదే సమయంలో కొన్ని వివాదాలు ఆభిమానులను కలవరానికి గురి చేశాయి. ఒలింపిక్స్‌లో మను, నీరజ్: 2024 పారిస్ ఒలింపిక్స్ ఈసారి అద్భుతంగా జరిగినప్పటికీ,భారత్‌కు స్వర్ణ పతకం దక్కలేదు. అయినప్పటికీ,భారత యువ షూటర్ మను బాకర్,జావెలిన్ అథ్లెట్ నీరజ్ చోప్రా విలక్షణంగా నిలిచారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ ఈసారి రజతం సాధించగా,మను బాకర్ ఒకే ఎడిషన్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.
వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు
కానీ, భారత్ గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య తగ్గింది,అలాగే ర్యాంక్ కూడా పడిపోయింది. వినేశ్ ఫొగాట్ పతకం సాధించలేకపోయింది: రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరినప్పటికీ పతకం సాధించలేకపోయింది. తనను కనీసం రజత పతకానికి అర్హురాలిగా తీసుకోవాలని డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిణామంతో, రెజ్లింగ్‌కు వీడ్కోలు చెబుతూ ఆమె సంచలన ప్రకటన చేసింది.ఆమెకు కావలసిన మద్దతు ఇవ్వకపోవడం గురించి ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్‌లో భారత్ ఘనత: 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలను సాధించారు. ఈ సారి,29 పతకాలు (7 స్వర్ణాలు,9 రజతాలు,13 కాంస్యాలు) సాధించి,18వ స్థానంలో నిలిచింది.ఇది పారాలింపిక్స్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాలు.
చెస్ లో ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్
అథ్లెటిక్స్ విభాగం నుండి అత్యధిక పతకాలు వచ్చాయి,వీటిలో నాలుగు స్వర్ణాలు కూడా ఉన్నాయి. భారత చెస్ క్రీడలో అత్యుత్తమ విజయం: భారత చెస్ క్రీడలో ఈ సంవత్సరం అద్భుత ప్రగతి సాధించారు. గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. అలాగే కోనేరు హంపి న్యూయార్క్‌లో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. హంపి, 2019లో కూడా ఛాంపియన్‌గా నిలిచిన విషయం మనసులో ఉంచుకుంటే, ఈ విజయం మరింత విశేషంగా మారింది. క్రికెట్‌లో టీ20 ప్రపంచ కప్ విజయం: 2024 క్రికెట్‌లో టీ20 ప్రపంచ కప్ భారత్‌కు విజయాన్ని అందించింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్‌తో టీమ్‌ఇండియాకు వరల్డ్ కప్‌ను అందించాడు.
టీమిండియా కొత్త కోచ్ గా గంభీర్
కెప్టెన్ రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికారు.గంభీర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే,జైషా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. రోహన్ బోపన్న రికార్డు: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ సంవత్సరం 43ఏళ్ల వయస్సులో డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంకర్‌గా నిలిచారు. ఇంకా,ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో తన సహచరుడుఎబ్డెన్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుని, తన కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సాధించారు. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల రికార్డు: 2024 అక్టోబర్లో,భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా కాంస్య పతకాన్ని సాధించి,జపాన్‌కు ఓడిపోయి కాంస్య పతకాన్ని పొందారు. ఇలాంటి విజయాలు భారత క్రీడాలోకం 2024ను మరింత ప్రత్యేకంగా చేశాయి.