జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 19గా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈనెల 22 నాటికి ఎన్నికల పరిశీలన పూర్తి కానుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 50 ఓట్లు ఉంటాయి. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 23న మొదలై.. 25న ముగియనుంది. జూన్ 28 నుంచి జులై 1 మధ్య నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎన్నికల అధికారిగా మహేష్ మిత్తల్
జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మిత్తల్ ను ఐఓఏ సోమవారం డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల అధికారిగా నియమించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడితో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నలుగురు వైస్ ప్రెసిడెంట్లు, కార్యదర్శి, కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఐదుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ముఖ్యంగా కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలను డబ్ల్యూఎఫ్‌ఐ 2022లో రద్దు చేసిన విషయం తెలిసిందే. జులై 6న మెజార్టీని బట్టి పోలింగ్ జరిగిన రోజున విజేతను ప్రకటిస్తారు.