LOADING...
IND vs ENG: గాయాల బెడద.. భారత్‌ తుది జట్టుపై సందిగ్ధతలు!
గాయాల బెడద.. భారత్‌ తుది జట్టుపై సందిగ్ధతలు!

IND vs ENG: గాయాల బెడద.. భారత్‌ తుది జట్టుపై సందిగ్ధతలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు గాయలతో సతమతమవుతోంది. ఇప్పటికే 1-2తో వెనుకబడిన శుభ్‌మన్ గిల్ సేనకు మాంచెస్టర్ వేదికగా జరగబోయే మ్యాచ్ తప్పక గెలవాల్సినదే. అయితే, కీలక ఆటగాళ్ల గాయాల కారణంగా జట్టు ఎంపిక మేనేజ్‌మెంట్‌ను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టేసింది. విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్న ఆటగాళ్లను మళ్లీ బరిలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ గాయపడ్డాడు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న నితీశ్‌కుమార్ రెడ్డికీ గాయం కావడంతో బీసీసీఐ అతను సిరీస్ మొత్తానికి దూరమైనట్టు ప్రకటించింది. ఇక మూడో టెస్టులో గాయంతో ఆడిన రిషబ్ పంత్ విషయంలో మేనేజ్‌మెంట్ ముందు జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది.

Details

అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకొనే అవకాశం

మూడో మ్యాచ్ తర్వాత బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చినా.. నాలుగో టెస్టులో అతడిని కొనసాగించాలా లేదా అన్న నిర్ణయం ఇంకా స్పష్టంగా లేదు. మరోవైపు సిరాజ్‌కి విశ్రాంతి అవసరం అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒత్తిడి తేవాలంటే బుమ్రా, సిరాజ్ లాంటి ప్రధాన పేసర్ల భాగస్వామ్యం అవసరం. కానీ ఒకేసారి ఇద్దరినీ విశ్రాంతి ఇస్తే, ఆకాశ్‌దీప్‌ కూడా గాయంతో దూరమవుతే, జట్టులో పేస్ విభాగం మొత్తాన్ని కొత్తవారితో నింపాల్సి వస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణపై మళ్లీ ఆధారపడితే సమస్యలు తలెత్తే ప్రమాదముంది. బదులుగా ఇటీవల ఇంగ్లాండ్‌లో అనధికారిక టెస్టులో అద్భుతంగా రాణించిన అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకునే యోచన మేనేజ్‌మెంట్‌ కలిగి ఉంది.

Details

 ఆల్‌రౌండర్ కష్టాలు

నితీశ్ గాయంతో వెనక్కి వెళ్లిన నేపథ్యంలో, అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నదే ప్రశ్న. రెండు టెస్టుల్లోనూ నితీశ్ నాణ్యతతో ఆడినప్పటికీ.. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ పునరాగమనానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, పేస్ ఆల్‌రౌండర్‌ను తీసుకోకుండా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవాలన్న ఆలోచనలూ మెల్లగా ఊపందుకుంటున్నాయి. స్పిన్‌ బలపరిచే దిశగా.. మాంచెస్టర్‌లో మూడో రోజు నుంచి స్పిన్‌కు సహకరించే పరిస్థితులు నెలకొంటాయని అంచనా. ఈ నేపథ్యంలో చైనామన్‌ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు మెండుగా ఉన్నాయి. అతడి నెమ్మదైన బంతులు మందకొడిగా మారే పిచ్‌పై బాగా పని చేస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

Details

 తుది జట్టుపై అంచనా

ఇంగ్లాండ్ పిచ్‌లపై బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ స్థిరత అవసరం. క్రీజులో కూర్చున్నవారికే పరుగులు రావడం ఇక్కడ సాధ్యం. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపికలో మేనేజ్‌మెంట్ యుద్ధ ప్రణాళికతో వెళ్లవలసిన అవసరం ఉంది. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌కి అవకాశమివ్వాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సమతూకంగా జట్టు ఉండాలంటే ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, ముగ్గురు ప్రధాన పేసర్లు ఉండేలా జట్టు ఉండాలని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చూస్తే, గాయాల కారణంగా జట్టులో మార్పులు తప్పవన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మేనేజ్‌మెంట్ తీసుకునే తుది నిర్ణయమే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది.