Mumbai Indians : సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత నడిచిందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ (MI), చివరికి గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి తిరిగి ఉత్సాహాన్ని పొందింది. తిలక్ వర్మ అద్భుత శతకం, అశ్విని కుమార్ ప్రభావవంతమైన బౌలింగ్‌తో జట్టు మళ్లీ సరైన దారిలోకి వచ్చింది. అయితే నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిన జట్టు ఒక్కసారిగా ఎలా బలంగా నిలబడగలిగింది? డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది? ఈ విషయాలపై ఆ జట్టు బౌలర్ అశ్విని కుమార్ స్పష్టత ఇచ్చారు.
వివరాలు
డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే?
ఈ సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాతో పాటు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, మైదానం బయట ఎంత ఒత్తిడి ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం సానుకూల వాతావరణమే కొనసాగిందని అశ్విని తెలిపారు. "మేము గెలిచినా ఓడినా, మా మధ్య ఎప్పుడూ పాజిటివ్ చర్చలే జరిగేవి. హార్దిక్ భాయ్ జట్టులో ఎవ్వరినీ నిరుత్సాహానికి గురి కాలేదు. తిలక్ మంచి ఇన్నింగ్స్ ఆడతాడని, మేము గెలుస్తామని ముందుగానే నమ్మకం ఉండేది" అని ఆయన చెప్పారు.
వివరాలు
గుజరాత్‌కు గట్టి దెబ్బ..
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అశ్విని కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి గుజరాత్ టైటాన్స్‌పై గట్టి దెబ్బకొట్టాడు. 24 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. తన విజయానికి కారణమైన ప్రణాళిక గురించి మాట్లాడుతూ, "గుజరాత్ బ్యాటర్ల ఆటతీరును ముందుగానే అధ్యయనం చేశాను. పిచ్ ప్రవర్తనను గమనించి కెప్టెన్ హార్దిక్‌తో చర్చించాను. మేము సిద్ధం చేసిన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేశాం. శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేయడం చాలా ఆనందం కలిగించింది" అని వివరించాడు.
వివరాలు
ఆ శతకం సంచలనం..
ఈ మ్యాచ్‌లో ముంబై విజయంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలో హార్దిక్ పాండ్యా తిలక్‌తో మాట్లాడిన తర్వాత, తిలక్ కేవలం 45 బంతుల్లోనే శతకం సాధించి సంచలనం సృష్టించాడు. 99 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించడంలో అతని పాత్ర కీలకం. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఈ జట్టు, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముందున్న మ్యాచ్‌ల్లో మరిన్ని విజయాలు సాధించాల్సి ఉంది.