IPL 2025: ఒకరోజు ముందే ఐపీఎల్ కొత్త సీజన్ .. మార్చి 22న KKR,RCB మధ్య మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన కొద్ది రోజులకే ఈ ప్రతిష్టాత్మక టీ20 లీగ్ ప్రేక్షకులను అలరించనుంది.
మొదట మార్చి 23 నుండి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి.
అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సీజన్‌ను ఒక రోజు ముందుగా మార్చి 22న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని క్రిక్‌బజ్ వర్గాలు వెల్లడించాయి. తొలి మ్యాచ్ గత ఏడాది విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
వివరాలు
మొత్తం 12 మైదానాల్లో ఈ సీజన్ మ్యాచ్‌లు
గత సీజన్‌లో ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన తొలి మ్యాచ్‌ను స్వదేశీ మైదానం ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.
ఈ జట్టు మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ (RR)తో తలపడనుందని సమాచారం.
ఇక ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 25న జరిగే అవకాశం ఉంది.
అయితే,అధికారికంగా షెడ్యూల్‌పై ఐపీఎల్ నిర్వాహకులు ఎటువంటి ప్రకటన చేయలేదు.
మొత్తం 12 మైదానాల్లో ఈ సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లఖ్‌నవూ, ముల్లాన్‌పుర్, దిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ స్టేడియాలతో పాటు గువాహటి, ధర్మశాల కూడా కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
గువాహటి రాజస్థాన్ రాయల్స్ రెండో హోం గ్రౌండ్‌గా, ధర్మశాల పంజాబ్ కింగ్స్ రెండో సొంత మైదానంగా వ్యవహరించనుంది.
వివరాలు
ఐపీఎల్ 2025: కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిది?
ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి.రిటెన్షన్ విధానం ద్వారా, మెగా వేలం ద్వారా ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి.
అయితే,ఇప్పటికీ కొన్ని జట్లు తమ కొత్త కెప్టెన్లను అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా,రజత్ పటీదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా నియమించారు.
ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా,చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్,గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్, రాజస్థాన్ రాయల్స్‌కు సంజూ శాంసన్, పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా ఉన్నారు.
వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్,ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్లను ఇంకా ప్రకటించలేదు
అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR),ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తమ కెప్టెన్లను ఇంకా ప్రకటించలేదు.
ఢిల్లీ జట్టు సారథ్యానికి కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ పేరు పరిశీలనలో ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కూడా తమ కెప్టెన్సీ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.