Page Loader
IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..? 
తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..?

IPL TOP 2 Race: ఐపీఎల్‌లో కొనసాగుతున్న టాప్‌ 2 రేసు.. తొలి రెండు స్థానాల్లోకి వచ్చేదెవరు.. నిలిచేదెవరు..? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఉన్న పోటీకి తెరపడింది. ఇప్పుడు దృష్టి మొత్తం టాప్ 2 స్థానాలపై నిలిచింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్లు... పాయింట్ల పట్టికలో ముందు వరుసలో నిలవాలని తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఎందుకంటే టాప్ 2 స్థానాల్లో ఉన్న జట్లకు క్వాలిఫయర్-1లో ఓడినా మరో అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో టేబుల్ చివరలో ఉన్న జట్లు కూడా టాప్ 2 పోరుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో ప్లేఆఫ్స్ సమీకరణాలు మరింత ఉత్కంఠత కలిగిస్తున్నాయి.

వివరాలు 

గుజరాత్ టైటాన్స్ కు ఇలా..

ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇటీవలే ప్లేఆఫ్స్‌కు అర్హత లేని లఖ్‌నవూ షాక్ ఇచ్చింది. ఈ ఓటమితో గుజరాత్‌కు టాప్ 2 రేసులో పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది. గుజరాత్‌కు ఇప్పుడు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే 20 పాయింట్లు అవుతాయి. కానీ ఆ సమయంలో టాప్ 2లో నిలబడగలదా అనే విషయాన్ని బెంగళూరు, పంజాబ్ జట్ల ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఒకవేళ ఇప్పటికే పోటిలోంచి బయటపడిన చెన్నై, తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడిస్తే.. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టు మూడో స్థానానికి జారిపోవచ్చు.

వివరాలు 

ఆర్సీబీ భవితవ్యం ఇలా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తదుపరి రెండు మ్యాచ్‌లు సన్‌రైజర్స్, లఖ్‌నవూతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు విజయవంతంగా ముగిస్తే ఆర్సీబీ టాప్ 1 స్థానాన్ని కూడా అందుకోగలదు. అయితే ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడితే టాప్ 2లోకి ప్రవేశించే అవకాశాలు తగ్గిపోతాయి. గతంలో సన్‌రైజర్స్ లఖ్‌నవూను ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రియం చేసింది. తాజాగా లఖ్‌నవూ గుజరాత్‌ను ఓడించింది. దీంతో ఆర్సీబీకి తలనొప్పులు తప్పేలా లేవు.

వివరాలు 

పంజాబ్ కింగ్స్‌ దూసుకెళుతుందా? 

11 సంవత్సరాల తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం పంజాబ్ 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లు దిల్లీ, ముంబయితో ఉన్నాయి. ఈ రెండింటినీ గెలిస్తే పంజాబ్ 21 పాయింట్లతో టాప్ 2లోకి చొచ్చుకెళ్లే అవకాశముంది. ఒక మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపైనే పంజాబ్ ఆశలు ఆధారపడి ఉంటాయి.

వివరాలు 

ముంబయి ఇండియన్స్‌కు ముందున్న సవాళ్లు.. 

ఈ మ్యాచ్‌లో ముంబయి ఓడిపోతే, పాండ్య సేన నాలుగో స్థానానికే పరిమితం అవుతుంది. గెలిస్తే 18 పాయింట్లను సంపాదిస్తుంది. అయినా టాప్ 2లో నిలవాలంటే మిగిలిన మూడు జట్లు తమ తమ మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అట్టడుగు జట్ల ప్రభావం ఎలా ఉంటుందంటే... ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులో నుంచి బయటపడ్డ చెన్నై, హైదరాబాద్, లఖ్‌నవూ, దిల్లీ జట్లు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికీ చివరి మ్యాచ్‌ల్లో విజృంభించబోతున్నాయి. ఈ జట్లు చివరి మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన ఇస్తే, ఇప్పటికే ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన జట్లకు సమస్యలు తప్పవు. దీంతో ప్రతి మ్యాచ్ ఫలితమే కాదు, నెట్ రన్‌రేట్ కూడా టాప్ 4 జట్లను ప్రభావితం చేయనుంది.