IPL 2025: 2025 మార్చి 14న ప్రారంభం కానున్న ఐపీఎల్.. తదుపరి మూడు సీజన్ల తేదీలు వచ్చేశాయ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, వచ్చే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను బీసీసీఐ ఖరారు చేసినట్లు జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14న ప్రారంభమై మే 25న ముగుస్తుంది. 2026 సీజన్ మార్చి 15న మొదలై మే 31తో ముగుస్తుంది. 2027 ఎడిషన్ మార్చి 14న ప్రారంభమై మే 30న ముగియనుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మెగావేలం నవంబర్‌లో..
ఇంకా, ఐపీఎల్ 2025 మెగావేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఈ వేలంలో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఈసారి వేలంలో మొత్తం 574 ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో: 318 మంది అన్‌క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లు, 12 మంది అన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు, 366 మంది భారతీయ ఆటగాళ్లు, 208 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలం ద్వారా 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నారు. వీరిలో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఈ వేలం ప్రత్యేకంగా యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశంగా నిలవనుంది.