IPL Retention : ఢిల్లీ కెప్టెన్సీలో మార్పు .. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించింది. ప్రతి ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించబడింది, వీరిలో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలి. రిటెన్షన్ లిస్ట్ సమర్పించడానికి అక్టోబర్ 31 చివరి తేదీగా నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ఫ్రాంచైజీని వీడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని నిర్ణయించిన ఢిల్లీ యాజమాన్యం
ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవడంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు విఫలమైంది. ఈసారి ట్రోఫీని సాధించాలని ఢిల్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రికీ పాంటింగ్‌ను కోచ్ పదవి నుండి, సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ స్థానంలో నుంచి తొలగించారు. వీరి స్థానాల్లో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావులను నియమించారు. అలాగే, కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. అయితే కెప్టెన్సీ మార్పు పట్ల రిషబ్ పంత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడని, ఆ బాధ్యతలు తనకే కావాలని డిమాండ్ చేశాడని చెబుతున్నారు. ఈ డిమాండ్‌ను డీసీ యాజమాన్యం తిరస్కరించడంతో, పంత్ ఢిల్లీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
రిషబ్ పంత్‌ను వేలంలో కొనుగోలు చేయనున్న ఆర్సీబీ
ఇదిలా ఉండగా, రిషబ్ పంత్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. ఆర్సీబీకి ప్రస్తుతం కొత్త కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఉంది, ఎందుకంటే దినేష్ కార్తిక్ వీడ్కోలు పలకగా, ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసే అవకాశాలు లేవు. పంత్ రాకతో తమ అదృష్టం మారుతుందని ఆర్సీబీ ఆశిస్తోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ కూడా పంత్‌ను తమ జట్టుకు కెప్టెన్‌గా తీసుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.