Team India: సొంతగడ్డపై కప్పు కలేనా?.. భారత్‌కు ఉన్న అడ్డంకులెన్నో!
ఈ వార్తాకథనం ఏంటి
ఏ ఐసీసీ టోర్నీ ప్రారంభమైనా భారత జట్టుపై భారీ అంచనాలు ఉండటం సాధారణమే. అయితే గత దశాబ్ద కాలం పాటు ఆ అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది. కానీ గత రెండేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుని టీమ్‌ఇండియా తిరిగి తన సత్తాను చాటింది. ఇప్పుడు సొంతగడ్డపై జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటన్న విషయంపై ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ కప్పు-భారత్ మధ్య కొన్ని బలమైన అడ్డంకులు ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించలేం.
Details
ఆస్ట్రేలియా - ఫలితాలకే పరిమితం కావద్దు
ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌తో తన చివరి టీ20 సిరీస్‌ను ఆడిన ఆస్ట్రేలియా జట్టు 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. అయితే ఆ ఫలితాన్ని బట్టి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయడం పెద్ద పొరపాటే. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఇష్టం లేక ప్రధాన ఆటగాళ్లు కొందరు ఆ సిరీస్‌కు దూరంగా ఉండటంతో ఆ జట్టు బలహీనపడింది. అందుకే సిరీస్ ఓటమి ఎదురైంది. కానీ ప్రపంచకప్‌లో మాత్రం ఆస్ట్రేలియా పూర్తిగా భిన్నంగా ఆడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టైటిల్ ఫేవరెట్లలో ఆస్ట్రేలియా ఒకటిగా నిలవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకడైన ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్‌లతో కూడిన ఓపెనింగ్ జోడీ ఆ జట్టుకు అతిపెద్ద బలం.
Details
తన
ఇక జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్ వంటి దూకుడైన బ్యాటర్లు, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, కూపర్ కనోలీ, కామెరూన్ గ్రీన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఆసీస్‌కు ఉన్నారు. బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే అయినప్పటికీ, ఆ జట్టు లోతైన సమతుల్యంతోనే బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే, 2021లో టీ20 ప్రపంచకప్‌ను గెలిచింది.
Details
పరిస్థితులను అర్థం చేసుకుని… న్యూజిలాండ్
2021 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్... గత టోర్నీలో మాత్రం సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి మాత్రం ఆ జట్టు ఆల్‌రౌండ్ బలంతో కప్పుపై కన్నేసింది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడే అవకాశం దక్కడం కివీస్‌కు కలిసొచ్చే అంశం. ఆ సిరీస్‌లో 1-4తో ఓడినప్పటికీ, భారత జట్టుకు గట్టి పోటీనే ఇచ్చింది. భారత పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం, భారత ఆటగాళ్ల బలాబలాలపై ఒక అంచనాకు రావడం ఈ సిరీస్ ద్వారా కివీస్‌కు ఎంతో ఉపయోగపడింది. భారత్‌తో చివరి టీ20లో చెలరేగి ఆడిన ఫిన్ అలెన్‌కు తోడు కాన్వే, సీఫర్ట్, మిచెల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్రలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
Details
అన్ని విధాలా సమతుల్యం - దక్షిణాఫ్రికా
ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత్‌లో పర్యటించే అవకాశం దక్కించుకున్న మరో జట్టు దక్షిణాఫ్రికా. డిసెంబరులో జరిగిన సిరీస్‌లో 1-3తో ఓడినప్పటికీ, ఆతిథ్య భారత జట్టుకు సఫారీలు దీటుగానే పోటీ ఇచ్చారు. ఓపెనర్‌గా ఆడుతున్న కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ స్పిన్నర్‌గానూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని ఓపెనింగ్ భాగస్వామి డికాక్ ఎంతటి ప్రమాదకర బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రపంచ మేటి టీ20 బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బ్రెవిస్‌తో పాటు రికెల్టన్, స్టబ్స్‌లతో సఫారీ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.
Details
పటిష్టంగా సౌతాఫ్రికా
ఆల్‌రౌండర్లు మార్కో యాన్సెన్, కార్బిన్ బోష్ బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటగలరు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడలేకపోయిన రబాడ ప్రపంచకప్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. అతనితో పాటు ఎంగిడి, మఫాకాలతో పేస్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అయితే స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న భారత పిచ్‌లను దక్షిణాఫ్రికా ఎంతవరకు సమర్థంగా ఉపయోగించుకోగలదన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలింది.