LOADING...
Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?
అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా?

Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా నమోదు చేయకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబయి ఇండియన్స్, ఆ తరువాత వరుసగా నాలుగు పరాజయాలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో బుమ్రా ఫామ్‌పై వస్తున్న విమర్శలకు ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. బుమ్రా ఫామ్ కోల్పోయాడన్న అభిప్రాయాన్ని ఆయన ఖండించాడు. బుమ్రా బౌలింగ్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని జయవర్ధనే తెలిపాడు. అతడు తన స్థాయికి తగ్గట్టుగానే బౌలింగ్ చేస్తున్నాడని, కానీ పవర్‌ప్లేలో మిగతా బౌలర్లు ఒత్తిడి సృష్టించడంలో విఫలమవుతున్నారని వివరించాడు.

వివరాలు

బౌలింగ్ విభాగం మొత్తం విఫలం..

ప్రత్యర్థి జట్టు ప్రారంభంలో వికెట్లు కోల్పోకపోవడంతో, వారి బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌ను ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఎదుర్కొంటున్నారని చెప్పాడు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ ఆరంభ ఓవర్లలో వికెట్లు రాకపోవడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోవడానికి ఒక్క కారణాన్ని మాత్రమే చెప్పలేమని, బౌలింగ్ విభాగం మొత్తం సమష్టిగా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతోందని జయవర్ధనే అంగీకరించాడు.

వివరాలు

అతడిని ఆపడం కష్టం..

బుమ్రా ఒకసారి వికెట్లు తీయడం ప్రారంభిస్తే అతడిని ఆపడం కష్టమని, అతడిపై జట్టుకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశాడు. బుమ్రా ఒక్కరే కాదు, జట్టులో మరికొందరు నాణ్యమైన బౌలర్లు ఉన్నారని, అందరూ కలిసి బాధ్యత తీసుకుని మెరుగైన ఫలితాలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. అలాగే జట్టులో చోటుచేసుకున్న గాయాలు, అనారోగ్య సమస్యలు తమ ప్రణాళికలను దెబ్బతీశాయని జయవర్ధనే పేర్కొన్నాడు. అయినప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. మొత్తంగా చూస్తే బుమ్రా వికెట్లు దక్కకపోవడం అతని వ్యక్తిగత వైఫల్యం కాదని, అది జట్టు మొత్తం ప్రదర్శనతో ముడిపడి ఉన్న అంశమని స్పష్టం చేస్తూ తన స్టార్ బౌలర్‌కు మద్దతుగా నిలిచాడు.

Advertisement