Kagiso Rabada: ఐపీఎల్‌లో రబాడా సెన్సేషన్.. 100 మ్యాచ్‌లు, 145 వికెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన 100వ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రబాడా.. ప్రస్తుతం 150 వికెట్ల మార్క్‌కు చేరువలో ఉన్నాడు. ఈ సీజన్‌లో కూడా అతడు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
వివరాలు
145 వికెట్లు తీసిన యువ ఉత్తేజం..
2017లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రబాడా.. ఇప్పటివరకు 99 ఇన్నింగ్స్‌లలో 145 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22.61గా ఉంది. ఐపీఎల్‌లో 100కిపైగా వికెట్లు తీసిన బౌలర్లలో లసిత్ మలింగ తర్వాత రెండో అత్యుత్తమ సగటు ఇదే. రబాడా ఎకానమీ రేట్ 8.75గా ఉంది. లీగ్‌లో ఆరు సార్లు నాలుగు వికెట్లు తీసిన ఘనత కూడా అతని పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/21గా నమోదయ్యాయి. రబాడా కెరీర్‌లో అత్యుత్తమ ఐపీఎల్ సీజన్ 2020. తన ప్రదర్శనతో ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 50 మ్యాచ్‌లలో 76 వికెట్లు తీసిన రబాడా.. ఆ ఫ్రాంచైజీకి అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
వివరాలు
అత్యథిక వికెట్లు తీసిని బౌలర్‌గా రికార్డు..
ఐపీఎల్‌లో రబాడా పేరిట పలు రికార్డులు ఉన్నాయి. 2023లో కేవలం 64 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్లు పూర్తి చేసి, ఆ ఘనత సాధించిన వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. దీంతో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించిన మలింగ రికార్డును అధిగమించాడు. ఇక ఒకే ఐపీఎల్ సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రబాడా నిలిచాడు. 2026 సీజన్‌లో పవర్‌ప్లేలోనే 18 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడా కొనసాగుతున్నాడు.