Page Loader
Kane Williamson: ఐదు వరుస టెస్ట్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

Kane Williamson: ఐదు వరుస టెస్ట్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరోమారు అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిక్సర్‌తో తన 33వ టెస్ట్ సెంచరీని పూర్తిచేసుకున్న కేన్, టెస్టు క్రికెట్‌లో తన స్థాయిని మరోమారు నిరూపించుకున్నాడు. 137 బంతుల్లో 14 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో న్యూజిలాండ్‌కు భారీ ఆధిక్యాన్ని సాధించారు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. హ్యామిల్టన్‌లో ఇప్పటి వరకు 12 టెస్ట్‌లు ఆడిన కేన్‌ 1563 పరుగులు చేసి, ఈ వేదికపై 97.69 సగటుతో తన సత్తా చాటాడు.

Details

రెండోస్థానంలో వీవీఎస్ లక్ష్మణ్

ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన క్రికెటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో డాన్ బ్రాడ్‌మన్‌ ఉన్నారు. మెల్‌బోర్న్‌లో ఆయన సగటు 128.53గా ఉంది. వీవీఎస్ లక్ష్మణ్‌ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో 110.63 సగటుతో రెండో స్థానంలో ఉన్నారు. కేన్ విలియమ్సన్ సెంచరీతో న్యూజిలాండ్ మూడో టెస్ట్‌లో ఆధిపత్యాన్ని మరింత బలపర్చింది. మూడో రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల లీడ్‌తో 274/4 స్కోర్ చేసింది. కేన్ విలియమ్సన్ (123*), డారిల్ మిచెల్ (18*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌ రెండు వికెట్లు తీసినా, మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.