
IND vs PAK: పాక్ ఆటపై దృష్టి పెట్టాలి,వివాదాలు వదిలేయాలి: కపిల్ దేవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ (Asia Cup)లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరిగింది. మ్యాచ్ ముగిసిన తరువాత భారత క్రికెటర్లు,పాకిస్థాన్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకుండా వెనుదిరిగారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)వివరించాడు. ఈ పరిణామంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిగా చేస్తూ, ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే టోర్నమెంట్ బహిష్కరణకు వెళ్తామని కూడా హెచ్చరించింది. ఇదిలా ఉండగా, బుధవారం యూఏఈతో జరగాల్సిన మ్యాచ్‌కు పాక్ జట్టు నిర్ణీత సమయానికి మైదానానికి చేరుకోలేదు. దాంతో ఆట ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
వివరాలు
సూపర్ 4కు పాక్
ఈ సంఘటనల నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) పాక్ జట్టుకు హితవు పలికారు. "ఇలాంటి విషయాలు పెద్దవి కావు. పాకిస్థాన్ తమ ఆటమీదే దృష్టి పెట్టాలి. కరచాలనం చేయాలా లేదా అనేది వ్యక్తిగత ఇష్టం. ఎవరికైనా చేయాలనిపిస్తే చేస్తారు, చేయకపోతే చేయరు. దానికి ఇంత పెద్ద రాద్ధాంతంచేయడం సరికాదు. అలాంటివి పట్టించుకోవడం కంటే పాక్ జట్టు ముందుగా తన ప్రదర్శనను మెరుగుపరచుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో వారు సూపర్-4 దశకు చేరుకున్నారు. ఇక వచ్చే సెప్టెంబర్ 21న పాక్ మళ్లీ భారత్‌తో తలపడనుంది.