Ishan Kishan:భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య తొలి టెస్టులో వివాదం.. అంపైర్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం!
భారత్ A, ఆస్ట్రేలియా A జట్ల మధ్య జరిగిన అనధికారిక తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వివాదం చెలరేగింది. బంతిని మారుస్తూ తీసుకున్న అంపైర్ నిర్ణయంపై భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో టీమిండియా ఆటగాళ్లపై ఫీల్డ్ అంపైర్ క్రెయిగ్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఇషాన్ కిషన్ అంపైర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు బంతి మార్పుపై వివరణ అడిగినప్పుడు, అంపైర్ క్రెయిగ్ స్పందిస్తూ, ''ఇక్కడ చర్చకు తావులేదు. మీరు వెళ్లి ఆడండి'' అంటూ ఘాటు వ్యాఖ్యానించాడు.
అందుకే బంతి మార్చాం..
దీనికి స్పందించిన ఇషాన్ కిషన్, ''మీ నిర్ణయం చాలా మూర్ఖత్వంగా ఉంది. మేం ఇదే బంతితో ఆడాలా?'' అని అన్నాడు. అంపైర్ అతడిని ఉద్దేశించి ''నువ్వే స్క్రాచ్ చేశావు, అందుకే బంతి మార్చాం'' అని వివరణ ఇచ్చాడు. ఈ వివాదం మరింత తీవ్రమవడంతో భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇటు క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇదిలావుంటే, ఆసీస్ Aతో రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో పాల్గొన్న భారత్ A జట్టుకు, మొదటి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.