
IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అవుట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు ఆటగాడు, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముందని సమాచారం. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో నితీశ్ మోకాలి లిగమెంట్‌కు గాయమయ్యిందని సమాచారం లభించింది. ఇదే కారణంగా ఆదివారం నిర్వహించిన శిక్షణా సెషన్‌కు అతడు హాజరు కాలేదు. గాయం తీవ్రత కారణంగా మిగిలిన రెండు టెస్టుల్లో నితీశ్ ఆడే అవకాశం లేదని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
మూడో టెస్టులో నితీశ్ బంతితోనూ బ్యాట్‌తోనూ..
హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో జట్టుకు దూరమైన నితీశ్ రెడ్డి, అనంతరం శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా రెండో టెస్టులో టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. మూడో టెస్టులో నితీశ్ బంతితోనూ బ్యాట్‌తోనూ ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో మొత్తం 45 పరుగులు సాధించాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేయడం ద్వారా బ్యాటింగ్‌లో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ టెస్టుల్లో కలిపి 17 ఓవర్లు వేసి 3.64 ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. లార్డ్స్ టెస్టులో ఒకే ఓవర్‌లో బెన్ డకెట్, జాక్ క్రాలీలను ఔట్ చేయడం ద్వారా భారత జట్టుకు మంచి ఆరంభం అందించాడు.
వివరాలు
నితీశ్ రెడ్డి గాయంతో టీమిండియాలో ఆందోళన
ఇదిలా ఉండగా, గాయాలతో బాధపడుతున్న ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లభించలేదు. తాజాగా నితీశ్ రెడ్డి కూడా గాయపడడంతో టీమిండియాలో ఆందోళన మరింత పెరిగింది. అర్ష్‌దీప్ స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, నాలుగో టెస్టులో అతడు ఆడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఆకాష్ దీప్, అర్ష్‌దీప్‌లు గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి రాకపోతే.. బుమ్రా మాంచెస్టర్ టెస్టులో తప్పకుండా ఆడాల్సిందే. ప్రస్తుతానికి సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉండటంతో, మాంచెస్టర్ వేదికగా జరగబోయే నాలుగో టెస్టులో భారత్ తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.