IPL 2023: కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్ కతా నైట్ రైడర్స్
ఈడెన్ గార్డెన్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అంజిక్యా రహానే(37), శివం దూబే (50) పరుగులతో చెలరేగడంతో చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన కోల్ కతాకు అదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో సునీల్ నరైన్(0) బౌల్డ్ అయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ జగదీషన్ (1) పెద్ద షాట్ కు ప్రయత్నించి పెవిలియానికి చేరాడు. అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేష్ అయ్యర్(20) ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కోల్ కతా కష్టాల్లో పడింది.
49 పరుగుల తేడాతో కోల్ కతా ఓటమి
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాసన్ రాయ్ ఈడెన్ గార్డన్స్ లో బౌండరీల వర్షం కురిపించారు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్ లతో హాఫ్ సెంచరీని రాయ్ పూర్తి చేశాడు. థీక్షణ బౌలింగ్ లో జాసన్ రాయ్ (61) ఔట్ కావడంతో కోల్ కతా గెలుపు ఆశలకు బ్రేక్ పడింది. రీకూ సింగ్ 33 బంతుల్లో 53 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన రస్సెల్(9) ఈసారి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో కోల్ కతా 49 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. చైన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, థీక్షణ రెండు వికెట్లతో చెలరేగారు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.