Nicholas pooran : ఫామ్‌లో లేకపోయినా పూరన్‌కే ఛాన్స్.. కారణం చెప్పిన లాంగర్
ఈ వార్తాకథనం ఏంటి
ఓటమి అంచుల వరకు వెళ్లిన సమయంలో లక్నో జట్టు పేసర్ షమి కీలక సిక్స్‌తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. అయితే వచ్చిన అవకాశాన్ని లక్నో సూపర్ జెయింట్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిన సూపర్ ఓవర్‌లో లక్నో కేవలం ఒక పరుగే సాధించింది. అనంతరం రింకూ సింగ్ తొలి బంతినే బౌండరీకి తరలించి కేకేఆర్‌కు ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో విజయాన్ని అందించాడు.
వివరాలు
తీవ్ర విమర్శలకు దారి తీసిన నిర్ణయం అదే..
అయితే సూపర్ ఓవర్ సమయంలో లక్నో తీసుకున్న ఒక నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్‌కు పంపడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నరైన్ బౌలింగ్‌లో పూరన్‌కు మంచి రికార్డు లేకపోవడం కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో లక్నో ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. లాంగర్ మాట్లాడుతూ, "సునీల్ నరైన్ బౌలింగ్ చేస్తాడని మాకు ముందే తెలుసు. ప్రపంచ క్రికెట్‌లో నరైన్‌ను ఎక్కువసార్లు ఎదుర్కొన్న బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఒకడు. అందుకే అతడే సరైన ఎంపిక అని భావించాం. ప్రస్తుతం పూరన్ మంచి ఫామ్‌లో లేడని మాకు తెలుసు, అతడూ అదే అంగీకరిస్తాడు. అయినప్పటికీ సూపర్ ఓవర్ ఒత్తిడిని ఎదుర్కొనే ఆటగాడు అతడేనని నమ్మాం.
వివరాలు
దురదృష్టవశాత్తూ తొలి బంతికే ఔట్..
మంచి ఆటగాళ్లకు అండగా నిలబడటం జట్టు బాధ్యత. అందుకే మేం పూరన్‌కు మద్దతు ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ అతడు తొలి బంతికే ఔటయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా అతడు అద్భుతమైన టీ20 ఆటగాడిగా నిలిచాడు. అతడూ మనిషే కాబట్టి ఇలాంటి దశలు సహజం. ఒకే మ్యాచ్‌తో కాన్ఫిడెన్స్ దెబ్బతినదు. ఈ మ్యాచ్‌లో అతడిపై విశ్వాసం ఉంచాం. అయితే మా ప్రణాళిక అనుకున్నట్టు ఫలించలేదు. ఇదే క్రికెట్... ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం" అని వివరించాడు.
వివరాలు
మాకు కాస్త విరామం అవసరం: రిషభ్ పంత్
లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ, "ఈ ఓటమిపై ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే మాకు కాస్త విరామం అవసరం. మళ్లీ ఫ్రెష్‌గా మారేందుకు కొంత సమయం తీసుకుంటాం. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉండటం సహజమే. ఈ పరాజయంపై మేం మాలో మేం ప్రశ్నించుకుంటాం. జట్టులో అంతర్గతంగా చర్చలు జరుపుతాం. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్‌కు పంపడం జట్టు నిర్ణయం. అతడు ఫామ్‌లో లేడని తెలిసినా, ఆటగాడిపై నమ్మకం ఉంచడం అవసరం. అలాగే కేకేఆర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను దిగ్వేశ్ రాఠీతో వేయించడం గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కానీ జట్టు ప్రణాళికల ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే" అని తెలిపాడు.