ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిరాశపరిచింది. గతేడాది టోర్నీలో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శనతో ఫ్లే ఆఫ్స్ చేరింది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరం కావడం, యువ ఆటగాళ్ల వైఫల్యంతో లక్నో సూపర్ జెయింట్స్ కీలక మ్యాచుల్లోనూ చేతులెత్తేసింది. 14 మ్యాచుల్లో 8 గెలిచిన లక్నో మూడో స్థానంలో నిలిచింది. దీంతో జట్టును మరింత పటిష్టం చేయడానికి లక్నో యాజమాన్యం సిద్ధమైంది. ఇప్పటికే జట్టులో అవసరం లేని ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
దీపక్ హుడా, అమిత్ మిశ్రా, కరుణ్ నాయర్ ను పక్కన పెట్టే యోచనలో లక్నో!
ఈ ఏడాది దారుణంగా విఫలమైన దీపక్ హుడాకు గుడ్‌బై చెప్పేందుకు లక్నో సిద్ధమైంది. 2023 సీజన్‌లో 12 మ్యాచులాడిన అతను కేవలం 84 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచుల్లో 90 బంతులుఆడి 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. ఇందులో 34 బంతులను డాట్ చేయడం గమనార్హం. అతనితో పాటు బౌలింగ్‌లో ప్రభావం చూపని అమిత్ మిశ్రాపై కూడా వేటు వేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. ఇక వయస్సు కూడా మీద పడిపోవడంతో అతన్ని వదిలేసి యువ స్పిన్నర్‌ను తీసుకోవాలని లక్నో భావిస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని కరుణ్ నాయర్‌ను లక్నో పక్కనపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్లోనూ రాణించడం లేదు.