Surya Kumar Yadav : కెప్టెన్సీ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా : సూర్య
విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఆస్ట్రేలియాపై ఇండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఒక బంతి మిగిలి ఉండగానే చేధించింది. ఆసీస్‌పై గెలుపు తర్వాత టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని, వారిని చూసి గర్వపడుతున్నానని చెప్పాడు.
రింకూ ఆట అద్భుతం : సూర్యకుమార్ యాదవ్
భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా గొప్పగా ఉందని, ఇది పెద్ద మైదానం కాదని, బ్యాటింగ్ చేయడం సులభం అని తనకు తెలుసు అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యంగా రింకూ సింగ్ ఆడిన తీరు పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని, తీవ్ర ఒత్తిడిలోనూ అతను ప్రశాంతంగా ఉన్నాడన్నారు. రింకూ అద్భుతమైన ఫినిషింగ్ జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తోందని సూర్య కొనియాడారు. చివర్లో టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని చెప్పాడు. ఇక ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.