Page Loader
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫార్మాట్‌లో భారీ మార్పు?  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2024
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇప్పటికే పాకిస్థాన్‌లో పర్యటించబోమని స్పష్టంగా తెలిపింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే అంశంపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) ఇప్పటికీ తమ స్పష్టమైన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతోంది. టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా 75 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితిలో టోర్నీకి సంబంధించి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన ప్రసారకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వివరాలు 

ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో మార్చాలని..

ఈ నేపథ్యంలో, షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని ఐసీసీ (ICC)పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అయినా, టోర్నీలో కొన్ని పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశముందని చెబుతున్నారు. బ్రాడ్‌కాస్టర్లు, కొంతమంది వాటాదారులు ఈ ప్రతిపాదనను చర్చలో పెట్టినట్లు సమాచారం. ''ప్రతిష్టంభన కొనసాగితే, ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో మార్చాలని కొంతమంది వాటాదారులు కోరే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌గా మార్చడం ద్వారా మార్కెటింగ్‌ను సులభంగా,వేగంగా చేయవచ్చు'' అని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా..

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ తన జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికలపై నిర్వహించాలని, హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీని అంగీకరించాలని ఐసీసీకి అభ్యర్థన చేసింది. పాకిస్థాన్ కూడా ఈ హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరిస్తుందని అనుకుంటున్నారు. అయితే, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఇప్పటికే భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తమ మ్యాచ్‌ల కోసం కూడా ఇదే మోడల్‌ను అనుసరించాలని సూచించిందని తెలిసిందే. ఈ అంశంపై ఐసీసీ ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకారం వచ్చినట్లయితే, భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా జరుగుతాయి.