Page Loader
IPL 2025: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

IPL 2025: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కావాలని ఓడిపోయిందని రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఏప్రిల్ 19న జరిగిన మ్యాచ్‌లో ఏమైంది? ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీతో ప్రత్యేకత సంతరించుకుంది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (74), రియాన్ పరాగ్ (39) ప్రభావం చూపడంతో 182 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రాజస్థాన్ 17 ఓవర్లకే 156/2తో నిలిచింది.

Details

రెండు పరుగుల తేడాతో ఆర్ఆర్ ఓటమి

ఇక 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన పరిస్థితిలో, 8 వికెట్లు మిగిలి ఉండగా, రాజస్థాన్ విజయానికి అనుకూలంగా కనిపించింది. అయితే ఆ తర్వాత మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. చివరి ఓవర్లో సెట్ బ్యాటర్లు హెట్ మయర్, ధ్రువ్ జురెల్ ఉండగానే ఆ జట్టు 9 పరుగులు చేయలేకపోయింది. అవేశ్ ఖాన్ చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు ఇచ్చి, హెట్ మయర్‌ను ఔట్ చేయడంతో, రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది. ఈ పరిణామాలపై ఫిక్సింగ్ ఆరోపణలు ఊపందుకున్నాయి.

Details

 జైదీప్ బిహాని సంచలన వ్యాఖ్యలు 

న్యూస్ 18 రాజస్థాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, జైదీప్ బిహాని ఈ మ్యాచ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పిల్లలు కూడా చూస్తే ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో అర్థమవుతుంది. అటువంటి బ్యాటర్లున్నా చివరి ఓవర్లో 9 పరుగులు చేయలేకపోయారు. ఇది కచ్చితంగా ఫిక్సింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Details

రాజస్థాన్ క్రికెట్ సంఘంలో అంతర్గత విభేదాలు 

ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణ విషయంలో రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) జిల్లా పరిషత్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. జైదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్సీఏలో అధికార కమిటీని నియమించింది. ఇది అయిదోసారి పొడిగింపు పొందింది. మేము అన్ని టోర్నమెంట్లు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత తీసుకుంటాం. కానీ ఐపీఎల్ వస్తే మాత్రం జిల్లా పరిషత్ రంగంలోకి దిగుతుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం విషయంలో మా వద్ద ఏంఓయూ లేదని వారు చెబుతున్నారు. కానీ ప్రతి మ్యాచ్‌కు జిల్లా పరిషత్‌కు చెల్లింపులు చేస్తారు కదా? ఎంఓయూ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలా స్పందిస్తో ఆసక్తికరంగా మారింది.