LOADING...
Daniil Medvedev: డానియిల్ మెద్వెదెవ్‌ అసభ్య ప్రవర్తన.. 42,500 డాలర్ల భారీ జరిమానా

Daniil Medvedev: డానియిల్ మెద్వెదెవ్‌ అసభ్య ప్రవర్తన.. 42,500 డాలర్ల భారీ జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా టెన్నిస్ స్టార్ డానియిల్ మెద్వెదెవ్‌ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ బోంజి 6-3, 7-5, 6-7 (5), 0-6, 6-4 తేడాతో మెద్వెదెవ్‌ను ఓడించాడు. ఈ ఓటమిని సహించలేక, మెద్వెదెవ్ తన రాకెట్‌ను కోర్టులోనే విరగొట్టాడు. అంతేకాకుండా, ప్రేక్షకులతోను అనుచితంగా ప్రవర్తించడంతో నిర్వాహకులు అతడికి 42,500 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 37 లక్షలు) భారీ జరిమానా విధించారు. తొలి రౌండ్‌లో ఆడినందుకు వచ్చే 1,10,000 డాలర్ల ప్రైజ్‌మనీలో మూడో వంతుకు పైగా ఫైన్‌ పడటం గమనార్హం.

వివరాలు 

అప్పటినుంచే అసహనం 

మెద్వెదెవ్ ప్రారంభ రెండు సెట్లలో ఓటమి పాలయినా,మూడవ, నాల్గవ సెట్లలో గెలిచి పోరాటాన్ని కొనసాగించాడు. అయితే ఐదో సెట్‌లో బోంజి ఊహించని స్థాయిలో ప్రతిఘటన చూపినపుడు,పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. ముఖ్యంగా,మూడో సెట్ పాయింట్ సమయంలో ఒక ఫొటోగ్రాఫర్ ఆటకు ఆటంకం కలిగించడంతో ఆరు నిమిషాలపాటు మ్యాచ్ నిలిపేశారు. తర్వాత ఛైర్ అంపైర్ గ్రెగ్ బోంజికి మళ్లీ సర్వీస్ ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నిర్ణయానికి మెద్వెదెవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసి, ప్రత్యక్షంగా గ్రెగ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో ప్రేక్షకుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు. అయితే మెద్వెదెవ్‌ కూడా ప్రతిస్పందనగా అరుస్తూ రెచ్చగొట్టాడు. ఆ సెట్‌తోపాటు మరో సెట్ గెలిచినా, అతని అసభ్య ప్రవర్తన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివరాలు 

కాస్త ఓపికగా ఉండాలి.. 

టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకెర్ అభిప్రాయం ప్రకారం, అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా రెచ్చగొట్టినా, ఆటగాడు ఓర్పుతో ఉండాలి. రష్యా సహచరుడు ఆండ్రే రుబ్లెవ్ కూడా భావోద్వేగాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించాడు. ఈ ఏడాది మెద్వెదెవ్‌కు సరిగా ఫలితం రాలేదు. ప్రతి 'ఓపెన్'లోనూ చుక్కెదురైనట్లు ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో తొలి రౌండ్‌లోనే అతను ఓటమి పాలయాడు. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో బెంజమిన్ బోంజి చేతిలోనే మొదటి రౌండ్‌లో పరాజయం చవిచూశాడు. అదనంగా, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు 30,000 డాలర్ల జరిమానా, రాకెట్‌ను విరగొట్టినందుకు 12,500 డాలర్ల జరిమానా కూడా ఎదుర్కొన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాకెట్‌ విరగగొడుతున్న డానియిల్ మెద్వెదెవ్‌