Ryan Rickelton: 44 బంతుల్లో రికెల్టన్ సెంచరీ.. ముంబై తరపున వేగవంతమైన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ (MI) ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రికెల్టన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. మ్యాచ్ 41లో అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ముంబైకి శుభారంభం ఇచ్చాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఆడిన రికెల్టన్, రెండో ఓవర్‌లోనే ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్‌లపై దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేలోనే ముంబై ఇండియన్స్ 78 పరుగులు చేసింది. ఈ సమయంలో విల్ జాక్స్ కూడా దూకుడుగా ఆడుతూ మంచి సహకారం అందించాడు.
వివరాలు
వేగంగా సెంచరీ చేసి రికార్డ్
జాక్స్ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు కానీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రికెల్టన్‌కు నామన్ ధీర్ తోడుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను మళ్లీ నిలబెట్టారు. 15వ ఓవర్‌లో రికెల్టన్ తన సెంచరీని పూర్తి చేశాడు. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతను ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత రికార్డులను అతను బ్రేక్ చేశాడు.
వివరాలు
వేగంగా సెంచరీలు చేసిన వారు వీరే..
ముంబై ఇండియన్స్ తరఫున వేగవంతమైన సెంచరీల జాబితాలో ఇప్పుడు రికెల్టన్ టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాత 2008లో వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌పై సనత్ జయసూర్య, 2026లో గుజరాత్ టైటాన్స్‌పై తిలక్ వర్మ ఇద్దరూ 45 బంతుల్లో సెంచరీలు చేశారు. ఇక రికెల్టన్ ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితాలో 9వ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, రోహిత్ శర్మ (2 సెంచరీలు), లెండల్ సిమన్స్, సూర్యకుమార్ యాదవ్ (2 సెంచరీలు), కామెరూన్ గ్రీన్, క్వింటన్ డి కాక్, తిలక్ వర్మ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.