మినీ ఐపీఎల్ వచ్చేసింది.. టైటిల్ వేటలో సీఎస్కే, కేకేఆర్, ముంబై, ఢిల్లీ
ఫ్రాంచైజీ లీగ్ లు లేవని బాధపడే అభిమానులకు శుభవార్త అందింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జులై 13 నుంచి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీపడనున్నాయి. వీటిలో నాలుగు జట్లను ఐపీఎల్ లోని ప్రధాన ఫ్రాంచైజీలైన చైన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకున్నాయి. టెక్సాస్ సూపర్ కింగ్స్ (సీఎస్కే), లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ (కేకేఆర్), సియాటెల్ ఆర్కాస్ (డీసీ), ఎంఐ న్యూయార్క్ (ఎంఐ)తో పాటు వాష్టింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రానిస్కో యునికార్న్ జట్లు ఈ పోటీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. జులై 13 నుంచి ఈ లీగ్ ప్రారంభమై, జులై 30న ముగియనుంది.
తొలి లీగ్ మ్యాచ్ జులై 13న ప్రారంభం
తొలి లీగ్ మ్యాచ్ జులై 13న టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. జులై 25 వరకు లీగ్ దశ మ్యాచులు ముగియనున్నాయి. జులై 27న ఎలిమినేటర్, అదే రోజు క్వాలిఫయర్ జరగనుంది. 28న ఛాలెంజర్, జులై 30న ఫైనల్ మ్యాచ్ తో ఈ లీగ్ ముగియనుంది. సియాటెల్ ఫ్రాంచైజీలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా సహ యజమానిగా ఉండటం విశేషం. ఈ మేజర్ క్రికెట్ లీగ్ లో అంతర్జాతీయ క్రికెటర్లు జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ ఫించ్, క్వింటాన్ డికాక్, మిచెల్ మార్ష్, వనిందు హసరంగ, అన్రిచ్ నోర్జ్ లాంటి స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.