Ind Vs Aus: నాలుగో టెస్టుకు స్టార్ బౌలర్ షమీ రీ ఎంట్రీ
భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇండోర్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. ప్రస్తుతం చివరి టెస్టుపై దృష్టి సారించింది. నాలుగో టెస్టు కోసం మహ్మద్ షమీని మళ్లీ జట్టులోకి తీసుకోబోతున్నారు. మూడో టెస్టులో షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ వచ్చాడు. ప్రస్తుతం షమీ కోసం ఎవరిని రిజర్వ్ బెంచ్ పై కుర్చోబెడతారో వేచి చూడాల్సిందే. ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఖచ్చితంగా చివరి టెస్టు నెగ్గాల్సిందే. ప్రస్తుతం సిరీస్ 2-1తో భారత్ ముందంజలో ఉంది. షమీ గత రెండు ఇన్నింగ్స్‌లో 14.43 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ స్థానంలో షమీకి అవకాశం..?
ప్రస్తుతం వన్డే ర్యాకింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సిరాజ్‌ను తప్పించి, షమీకి అవకాశం కల్పించాలని టీమిండియా భావిస్తోంది. మూడో టెస్టులో సిరాజ్ కంటే ఉమేష్ మెరుగ్గా బౌలింగ్‌లో రాణించాడు. అందువల్ల, చివరి గేమ్‌లో షమీతో పాటు ఉమేష్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. 62 టెస్టులాడిన షమీ 27.04 సగటుతో 223 వికెట్లు తీశాడు. భారత పేసర్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ ఐదో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో ఆడిన 20 టెస్టుల్లో 20.63 సగటుతో 74 వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్ 55 టెస్టుల్లో 29.79 సగటుతో 168 వికెట్లను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో ఆడిన 31 టెస్టుల్లో 24.63 సగటుతో 101 వికెట్లు సాధించాడు.