IND vs AUS : టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ట్రావిస్ హెడ్ (53 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మార్నస్ లబుషేన్ (58 బంతుల్లో 28 నాటౌట్; 6 ఫోర్లు) హెడ్‌కు చక్కటి సహకరాం అందించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం టీమిండియా 2-1 తేడాతో ముందంజలో ఉంది.
కపిల్ రికార్డును అధిగమించిన అశ్విన్
మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో మాథ్యూ కుహ్నెమాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 163 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ లియోన్ ఈ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 2011 ప్రారంభం నుంచి స్వదేశంలో జరిగిన టెస్టులో భారత్‌కి ఇది ఐదవ ఓటమి. ఇందులో ఇంగ్లండ్ మూడు విజయాలు సాధించగా.. రెండు విజయాలను ఆస్ట్రేలియా సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 690 వికెట్లు పడగొట్టి కపిల్ దేవ్ (687) రికార్డును అధిగమించాడు.