Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా సూపర్ విక్టరి సాధించింది. ఈ మ్యాచులో మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో కివీస్ బ్యాటర్లు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత్‌కు ఆపద్భాందవుడయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లాథమ్ ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచును మలుపు తిప్పాడు. ఈ మ్యాచుల్లో 57 పరుగులిచ్చి 7 వికెట్ల పడగొట్టిన షమీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు పైగా పడగొట్టడం ఇది మూడోసారి.
అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన షమీ
ఇక సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా షమీ చరిత్రకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకూ ఏ బౌలర్‌కు ఇంత వరకు సాధ్యం కాలేదు. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నాలుగు సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేంది. మరోవైపు వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షమీ 17 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా, మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్‌ను సాధించారు.
జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన షమీ
ఇండియా తరపున ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన దిగ్గజ జహీర్ ఖాన్ రికార్డును కూడా షమీ బద్దలు కొట్టాడు. 2011 వరల్డ్ కప్ ఎడిషన్‌లో జహీర్ ఖాన్ 21 వికెట్లు తీశాడు. తాజాగా ఈ టోర్నీలో 6 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు.