BCCI: టీమ్ ఇండియా ప్రధాన కోచ్.. నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎంఎస్ ధోనీపేరిట నకిలీ దరఖాస్తులు
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం ఈ నెల బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. దరఖాస్తులలో భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్ పదవి కోసం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇవన్నీ నకిలీ దరఖాస్తులు. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి సోమవారంతో (మే 27) గడువు ముగిసింది. అయితే, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, సచిన్ టెండూల్కర్,ఎంఎస్ ధోని,హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ సహా మాజీ క్రికెటర్ల పేర్లతో బిసిసిఐకి చాలా దరఖాస్తులు వచ్చాయి.
గతంలో కూడా పెద్ద సంఖ్యలో నకిలీ దరఖాస్తులు
ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని.. అయితే అవన్నీ నకిలీవే అని తేలింది. బీసీసీఐ మే 13న గూగుల్ ఫారమ్‌ల ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో నకిలీ దరఖాస్తులు వచ్చాయి . బీసీసీఐకి నకిలీ దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో రాహుల్ ద్రవిడ్‌ను నియమించే ముందు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా, ఆ సమయంలో కూడా పెద్ద సంఖ్యలో నకిలీ వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త కోచ్ పదవీకాలం.. మూడున్నరేళ్లు
ఇకపోతే, ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్నరాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరినాటికి ముగుస్తుంది. జూన్ 1నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఆ తర్వాత కొత్త కోచ్ పదవీకాలం జులై 1నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది. అంటే.. కొత్తగా బాధ్యతలు చేపట్టే కోచ్ 2027లో జరిగే తదుపరి వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉంటారు. ఒకవేళ ద్రవిడ్ మళ్లీ ఆ పదవిలో కొనసాగాలనుకుంటే..కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని గతంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. అయితే కుటుంబానికి సమయం కేటాయించాలనుకున్న అతడు మళ్లీ దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపలేదు.