Surya Kumar Yadav : ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం.. మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ వద్దు : సూర్యకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ రోజు రోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. తొలినుంచే ఈ పోరును బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనం చేయలేదు. అప్పటి నుంచి పాక్ మాజీ క్రికెటర్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Details
నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టం
తాము కప్ గెలిచిన పక్షంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఏసీసీ ప్రెసిడెంట్ మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఇష్టంలేదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే నిర్ణయం తీసుకోవాలని పీసీబీ కూడా ఏసీసీకి సూచించినట్లు తెలుస్తోంది. లేదంటే మరోసారి మైదానంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తోంది.
Details
భారత్-పాక్ మళ్లీ తలపడతారా?
గ్రూప్ స్టేజ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగగా, అందులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సూపర్-4లో దాదాపు స్థానం ఖరారు చేసుకుంది. ఇక పాక్ పరిస్థితి మాత్రం కీలకం. యూఏఈపై జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సూపర్-4లో మరోసారి భారత్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. తొలి మ్యాచ్ నుంచే ఇరు జట్ల మధ్య ఉద్రిక్తతల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, సూపర్-4 లేదా ఫైనల్‌లో మరోసారి తలపడితే పరిస్థితులు ఎలా మారుతాయోనని అభిమానులు చర్చిస్తున్నారు.
Details
పాకిస్థాన్ ఆడాలా వద్దా అనే సందిగ్ధం
యూఏఈతో మ్యాచ్ ఆడాలా వద్దా అన్నదానిపై పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ (Pakistan Team) మంగళవారం రాత్రి వరకూ తీవ్రంగా చర్చించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో జట్టు నిర్ణయం స్పష్టంగా తెలియకపోవడంతో జర్నలిస్టులకు వరుసగా సందేశాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఇక పాక్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలని ఐసీసీకి డిమాండ్ చేసింది. కానీ ఆ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. బదులుగా రాబోయే పాక్ మ్యాచులకు రిచర్డ్‌సన్‌ను రిఫరీగా నియమించనుంది. ఈ పరిణామాల తర్వాతే పాకిస్థాన్ ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పీసీబీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీనిని తమ మీడియా వ్యూహాత్మకంగా పాజిటివ్‌గా ప్రచారం చేసుకోవడం గమనార్హం.