Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు
పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి, బాబర్ అజామ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం, బోర్డులో మార్పులపై విమర్శలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, మరో కీలక విషయం వెలుగుచూసింది. గత నాలుగు నెలలుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని వార్తలు వస్తున్నాయి. బాబర్ అజామ్, రిజ్వాన్, షహీన్ షా అఫ్రిది వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారని అక్కడి మీడియా తెలిపింది. పురుషుల క్రికెట్ జట్టుకు మాత్రమే కాకుండా మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు అందలేదని తెలుస్తోంది.
స్పాన్సర్‌షిప్ పేమెంట్లు కూడా బకాయిలు
2023 జులై 1 నుండి 2026 జూన్ 30 వరకు 25 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లు పాక్ క్రికెట్ బోర్డు ఇచ్చింది. అయితే ఇటీవల జట్టు ప్రదర్శన దారుణంగా ఉండటంతో,ఈ కాంట్రాక్ట్‌లను సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. "గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు సీనియర్ క్రికెటర్లు బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు అనుకూలంగా కాంట్రాక్ట్‌లను పొందారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.నెలవారీ జీతాలు కూడా అందుకోలేకపోతున్నారు. జులై నుండి అక్టోబర్ వరకు జీతాలు లేవు. బోర్డుకి ఈ సమస్యను సమాచారం ఇచ్చినా,పరిష్కారం మాత్రం లభించలేదు. తమ జెర్సీలపై లోగో వేసుకోవడం వల్ల చెల్లించాల్సిన స్పాన్సర్‌షిప్ పేమెంట్లు కూడా బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌లను పునఃసమీక్షించే అవకాశం ఉంది"అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఐసీయూలో మా క్రికెట్ పరిస్థితి: పాక్ మాజీ క్రికెటర్
పాక్ క్రికెట్ పరిస్థితి గురించి పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ, "ప్రస్తుతం పాక్ క్రికెట్ ఐసీయూలో ఉంది. జట్టు నాయకత్వంలో సంక్షోభం నెలకొంది. సరైన మార్గదర్శకత్వం అందించేందుకు ఎవరూ లేరు. బాబర్ అజామ్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకూడదు. అతడు చాలా ఆలస్యంగా రాజీనామా చేశాడు. వ్యక్తిగతంగా, అలాగే జట్టుకూ ఈ ఆలస్యం నష్టం చేసింది. ఇకనుంచైనా తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు విజయాలు సాధించడానికి కృషి చేయాలి" అని వ్యాఖ్యానించాడు.