Page Loader
Olympics 2036: భారత్​లో ఒలింపిక్స్  నిర్వహిస్తే  రూ.64,000 కోట్ల ఖర్చు 
భారత్​లో ఒలింపిక్స్ నిర్వహిస్తే రూ.64,000 కోట్ల ఖర్చు

Olympics 2036: భారత్​లో ఒలింపిక్స్  నిర్వహిస్తే  రూ.64,000 కోట్ల ఖర్చు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ప్రపంచ క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, 2036 ఒలింపిక్స్‌,పారాలింపిక్స్‌ హోస్టింగ్‌ గురించి తన అభిరుచిని తెలియజేస్తూ, భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు అధికారిక లేఖను పంపింది. అయితే, ఒలింపిక్స్‌ నిర్వహణ చిన్న వ్యవహారం కాదు. దీనికోసం వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం రూ.34,700 కోట్ల నుంచి రూ.64,000 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

ఖర్చు భారీగా పెరగనుందా? 

2036 ఒలింపిక్స్‌ హోస్టింగ్‌ సాధ్యాసాధ్యాలపై సమీక్షించేందుకు ఇటీవల గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హై-లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో భారత్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసినట్లు సమాచారం. అనంతరం, "రివ్యూ మీటింగ్ - ప్రిపేర్డ్‌నెస్ టువార్డ్స్ అహ్మదాబాద్ 2036" అనే డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం, 2024లో ప్యారిస్‌లో నిర్వహించిన ఒలింపిక్స్‌ ఖర్చుతో పోల్చితే, భారత్‌లో నిర్వహిస్తే ఖర్చు రెట్టింపు అవుతుందని తెలుస్తోంది. అహ్మదాబాద్‌తో పాటు భోపాల్, గోవా, ముంబయి, పుణే వంటి ప్రధాన నగరాల్లో ఈ క్రీడా మహోత్సవాన్ని నిర్వహించేందుకు అవసరమైన వ్యయ అంచనాలను ఇందులో పేర్కొన్నారు.

వివరాలు 

హోస్టింగ్‌ రేసులో భారత్‌ 

భారత్‌తో పాటు సౌదీ అరేబియా,ఖతార్,తుర్కియే తదితర దేశాలు కూడా ఒలింపిక్స్‌ హోస్టింగ్‌ పై ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే,ఇప్పటి వరకు ఎంతమంది అధికారికంగా అభ్యర్థిత్వం ప్రకటించారన్న దానిపై స్పష్టత లేదు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన తరువాత,భారత్‌ "ఇన్‌ఫార్మల్ డైలాగ్" దశ నుంచి "కంటిన్యూయస్ డైలాగ్" దశకు ప్రవేశించింది. ఈ దశలో హోస్టింగ్‌ దేశంలో అవసరమైన క్రీడా మౌలిక సదుపాయాల పురోగతిని అధ్యయనం చేస్తారు. తదుపరి "టార్గెటెడ్ డైలాగ్" దశలో ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం ప్రత్యేకమైన అధికారిక బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆపై, ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయడం ద్వారా హోస్టింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, 2036 ఒలింపిక్స్‌ నిర్వహించే దేశంపై 2026లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

భారత్‌కు ఒలింపిక్స్‌ హోస్టింగ్‌ అవకాశముందా? 

ఒలింపిక్స్‌ నిర్వహణ విషయంలో బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు,స్పాన్సర్లు,ప్రభుత్వ మద్దతు,ప్రజల ఆదరణ వంటి అంశాలు కీలకం. ఇలాప్రతిదీ పరిశీలించినప్పుడు,భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తే ఐఓసీకి లాభదాయకమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల,ఐఓసీ కూడా భారత్‌ను ఒక ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌ ఒలింపిక్స్‌ హోస్టింగ్‌ కోసం తొలుత 2032గేమ్స్‌ నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. అయితే, కొన్ని కారణాల వల్ల 2036కు మార్పు చేసుకుంది.భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో మాట్లాడుతూ,"2036 ఒలింపిక్స్‌ హోస్టింగ్‌ కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం.వెనుకడుగు వేయం.ఇది 140కోట్లభారతీయుల కల.అలాగే, 2029యూత్ ఒలింపిక్స్‌ను కూడా హోస్ట్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని స్పష్టం చేశారు. ఈప్రతిష్టాత్మక ఈవెంట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించగలిగితే, దేశ క్రీడారంగానికి, ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఉత్సాహం లభించనుంది.