PAK vs ENG: పాక్‌కు స్వదేశంలో మరో ఓటమి.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలోనే నిలిచిపోయేంత చెత్త రికార్డు
పాకిస్థాన్ స్వదేశంలో మరో టెస్టు ఓటమిని చవి చూసింది. ఈసారి 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నిలిచిపోయేంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500కి పైగా పరుగులు సాధించి, 'ఇన్నింగ్స్ తేడా'తో ఓడిపోవడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌ల్లో 550కి పైగా పరుగులు సాధించిన సందర్భంలో ఫలితం వచ్చిన రెండో మ్యాచ్ ఇదే. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ 74 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఎక్కువ సేపు నిలవలేదు..
ఓవర్‌నైట్ 152/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ మరో 68 పరుగులు మాత్రమే జోడించి, మొత్తం స్కోరు 220 వద్ద రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ దెబ్బతిన్నది.అఘా సల్మాన్ (63),ఆమీర్ జమాల్ (55*)హాఫ్ సెంచరీలు చేసినా,తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. చివరి బ్యాటర్ అబ్రార్ అహ్మద్ జ్వరం కారణంగా మైదానంలోకి దిగకపోవడంతో పాక్ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 4,గస్ అట్కిన్సన్ 2, కార్సె 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 556/10 స్కోరు చేయగా,ఇంగ్లండ్ 823/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
మరికొన్ని విశేషాలు..
ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. జో రూట్ (262) డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో పాకిస్థాన్‌కి వరుసగా ఇది ఆరో టెస్టు ఓటమి. గత 9 టెస్టుల్లో ఏడింట్లో పాక్ ఓడిపోయింది. అందులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కూడా ఉంది. ముల్తాన్ టెస్టులో మూడు ఇన్నింగ్స్‌లలో కలిసి రన్‌రేట్ 4.51. 2000కిపైగా బంతులు వేసిన మ్యాచ్‌లో ఇంత వేగంగా పరుగులు రావడం విశేషం. అయితే, 2022లో రావల్పిండి టెస్టులో 4.54 రన్‌రేట్ నమోదైంది. పాకిస్థాన్ బౌలర్లు 150 ఓవర్లపాటు(1200 బంతులు)బౌలింగ్ చేయగా,ఒక్క మెయిడిన్ మాత్రమే ఉండటం గమనార్హం.
మరికొన్ని విశేషాలు..
గతంలో, 1939లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 709 బంతులు వేసి, ఒక్క మెయిడిన్ కూడా వేయలేదు. ఇంగ్లండ్ ఆసియాలో ఇన్నింగ్స్ తేడాతో రెండోసారి విజయం సాధించింది. 1976లో భారత్‌ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది. మార్చి 2022 నుంచి పాకిస్థాన్‌కు స్వదేశంలో ఒక్క టెస్టు విజయం కూడా లేదు. మొత్తం 11 మ్యాచ్‌లలో, ఏడింట్లో ఓడిపోగా, నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.