Page Loader
Babar Azam: బాబర్ అజామ్‌పై వేటు.. పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి
బాబర్ అజామ్‌పై వేటు.. పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి

Babar Azam: బాబర్ అజామ్‌పై వేటు.. పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) నిర్ణయానికి సర్వత్రా విమర్శలు వచ్చాయి. పీసీబీ ఈ నిర్ణయంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబర్‌ను పక్కన పెడుతూ సెలక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని క్రికెటర్‌ ఫకర్‌ జమాన్‌ ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీతో పోల్చుతూ సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టుకు పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు (PAK vs ENG) లో బాబర్‌ అజామ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో బాబర్‌ అజామ్ 30, 5 పరుగులు మాత్రమే చేశాడు.

వివరాలు 

పీసీబీ నిర్ణయంపై ఫకర్‌ జమాన్‌ మండిపాటు 

అందుకే, ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్‌ జట్టులో ఈ మాజీ కెప్టెన్‌కు చోటు దక్కలేదు. పీసీబీ మాట్లాడుతూ, బాబర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారని పేర్కొంది. పీసీబీ నిర్ణయంపై ఫకర్‌ జమాన్‌ ఎక్స్‌లో మండిపడ్డాడు. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పేలవ ప్రదర్శన చేసినప్పుడు అతడిని టీమ్‌ ఇండియా తొలగించలేదని,అందుకే బాబర్‌ అజామ్‌పై తీసుకున్న నిర్ణయం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వివరాలు 

ఫకర్‌ జమాన్‌ ఏమి పోస్టు పెట్టాడంటే

"బాబర్‌ అజామ్‌ను తొలగించాలన్న సూచనలు వినడం ఆందోళన కలిగిస్తోంది. 2020-2023 మధ్య కాలంలో 19.33, 28.21, 26.50 సగటు ఉన్న సమయంలో టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని బీసీసీఐ పక్కన పెట్టలేదు. నిజంగా పాకిస్థాన్‌ సృష్టించిన అత్యుత్తమ బ్యాటర్‌ బాబర్‌. అలాంటి స్టార్‌ ప్లేయర్‌ను పక్కన పెట్టాలన్న నిర్ణయం జట్టుకు ప్రతికూల సందేశాన్ని పంపుతుంది. మన కీలక ఆటగాళ్లను అణగదొక్కడం కంటే వారిని కాపాడుకోవడంపై దృష్టిపెట్టాలి" అని ఫకర్‌ జమాన్‌ తీవ్రంగా మండిపడ్డాడు.

వివరాలు 

ఫకర్‌ జమాన్‌ వ్యాఖ్యలపై పీసీబీ పెద్దలు తీవ్ర అసంతృప్తి

ఫకర్‌ జమాన్‌ వ్యాఖ్యలపై పీసీబీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సెలక్షన్‌ కమిటీ బాబర్‌ అజామ్‌కు తాము తీసుకున్న నిర్ణయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. సెలక్షన్‌ కమిటీలో కొత్తగా చేరిన మాజీ కెప్టెన్‌ అజర్‌ అలీ బాబర్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ భవిష్యత్‌ ప్రణాళికలలో బాబర్‌ భాగమని అతడికి వివరించారు. మిగతా రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయడం తమకు సవాలుతో కూడుకున్నదని మరో సెలక్షన్‌ కమిటీ సభ్యుడు అఖిబ్‌ జావెద్‌ వివరించాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, వారు పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని వారికి నమ్మకం ఉందని తెలిపాడు.