Page Loader
I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం
భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం

I.M. Vijayan: భారత ఫుట్‌బాల్‌కు గర్వకారణం.. ఐ.ఎం. విజయన్‌కు పద్మశ్రీ పురస్కారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఫుట్‌ బాల్ మాజీ కెప్టెన్ ఐ ఎం విజయన్ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోని నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న విజయన్, ఈ గౌరవాన్ని భారతీయ ఫుట్‌బాల్ అభిమానులకు అంకితమిచ్చారు. విజయన్ పద్మశ్రీ అవార్డును అందుకున్న తొమ్మిదవ భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఆయన కంటే ముందు గోస్తో పాల్, శైలెన్ మన్నా, చునీ గోస్వామి, పీకే బెనర్జీ, భైచుంగ్ భుటియా, సునిల్ ఛేత్రీ, బెంబెమ్ దేవి, బ్రహ్మానంద్ సంక్‌వాల్కర్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ అవార్డును దేశంలోని ప్రతి ఫుట్‌బాల్ అభిమానులకు అంకితం చేస్తున్నానని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్లే కారణమని విజయన్ తెలిపాడు.

Details

కష్టాలను అధిగమించి దేశ గౌరవాన్ని అందకున్న విజయన్

విజయన్ కేరళలోని త్రిస్సూర్ జిల్లా, తిరుర్‌లో జన్మించాడు. అతను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే అతనికి ప్రగాఢమైన ఆసక్తి ఉండేది. విజయన్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేశాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను చిన్న వయస్సులోనే త్రిస్సూర్‌లోని ఫుట్‌బాల్ గ్రౌండ్స్ వద్ద చాయ్ (టీ) అమ్ముతూ జీవనం సాగించేవాడు. అయితే, అతని అసలు కల ఫుట్‌బాల్ ఆడటం కావడంతో, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకున్నాడు. అతని ఫుట్‌బాల్ నైపుణ్యాలను గుర్తించిన కేరళ పోలీస్ ఫుట్‌బాల్ జట్టు విజయన్‌ను తమ జట్టులోకి తీసుకుంది.

Details

పాకిస్థాన్ పై 12 నిమిషాల్లోనే హ్యాట్రిక్ గోల్స్

భారత జాతీయ జట్టుకు 88 సార్లు ప్రాతినిధ్యం వహించిన విజయన్, 39 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. 1991 జనవరిలో తిరువనంతపురంలో నెహ్రూ కప్‌లో రొమేనియాతో మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి వచ్చిన విజయన్ వచ్చాడు. 12 సంవత్సరాల పాటు భారత జట్టులో కొనసాగాడు. 2003 అక్టోబర్‌లో హైదరాబాద్లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ ఫైనల్ తర్వాత ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పిన అతను భారత ఫుట్‌బాల్‌లో అత్యంత ఆదరణ పొందిన క్రీడాకారుడిగా మారాడు. 1 999 SAF గేమ్స్‌లో పాకిస్తాన్‌పై కేవలం 12 నిమిషాల్లో అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ హ్యాట్రిక్ సాధించిన ఘనత అతనికి దక్కింది.

Details

ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డుకు మూడుసార్లు ఎంపిక

1993, 1997, 1999 సంవత్సరాల్లో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డును మూడు సార్లు అందుకున్నాడు. ఇది భారత ఫుట్‌బాల్‌లో ఒక గొప్ప ఘనత. విజయన్ తన ఫుట్‌బాల్ జీవితం మొత్తం 2003 వరకు కొనసాగించగా, జాతీయ స్థాయిలో కూడా అనేక విజయాలను అందుకున్నాడు. క్లబ్ స్థాయిలో ఎఫ్‌సి కోచి, జెసిబి, మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, జపాన్ క్లబ్లు వంటి ప్రముఖ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.