
Asia Cup 2025: భారీ స్ట్రైక్‌రేట్ ఉన్నా యశస్విని పక్కనపెట్టడం సరైంది కాదు: అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్-2025 కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే, ఈ జాబితాలో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత టీ20 ప్రపంచకప్‌లో బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులో ఉన్న యశస్విని ఈసారి పూర్తిగా పక్కన పెట్టడంపై సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వివరాలు
నాయకత్వం రేసులోనూ నిలిచిన ఆటగాడు..
''టెస్ట్ క్రికెట్‌లో అవకాశం వచ్చిన వెంటనే దాన్ని అందిపుచ్చుకున్న ఆటగాడు యశస్వి జైస్వాల్. ఇటీవల కాలంలో టెస్టుల్లో ప్రవేశించి అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు.ఎలాంటి ఫార్మాట్ అయినా,అతడికి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. అలాంటి ఆటగాడిని ఇప్పుడు ఆసియా కప్ జట్టులోకి తీసుకోకపోవడం షాక్‌కు గురి చేసింది. ఒక దశలో నాయకత్వ పోటీలో నిలిచిన ఆటగాడే,ఇప్పుడు జట్టులో లేకపోవడం ఆశ్చర్యకరం.ఈ ఫార్మాట్‌లో అతడి స్ట్రైక్‌రేట్ 165. అంతటి గణాంకాలు ఉన్న ప్లేయర్‌ను పక్కన పెట్టడం సరైంది కాదు. జట్టు కోసం త్యాగం చేసి ఆడగల వారిని కనుగొనడం చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో యశస్వి వంటి ఆటగాడు సరిగ్గా సరిపోతాడు. ఆ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకరు'' అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
వివరాలు
ఆశ్చర్యానికి గురిచేసింది: మదన్ లాల్
మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా ఇదే అంశంపై స్పందించాడు. ''యశస్వి జైస్వాల్ లాంటి ప్రతిభావంతుడు జట్టులో లేకపోవడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. శుభమన్ గిల్ ఎంపిక మంచి నిర్ణయమే. అతడి ప్రదర్శన బాగుంది. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడు. కానీ జట్టు విజయం కోసం ప్రాధాన్యం కలిగిన ఇన్నింగ్స్ ఆడగల ఆటగాళ్లను పక్కన పెట్టకూడదు. ఆసియా కప్ గెలిచేంత శక్తివంతమైన జట్టు మనకుంది'' అని ఆయన స్పష్టం చేశాడు.
వివరాలు
బీసీసీఐ వర్గాల వాదన ఇలా..
అయితే, బీసీసీఐ వర్గాలు దీనిపై భిన్నమైన కారణాన్ని వెల్లడించాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత్‌కి టెస్ట్ సిరీస్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల్లో ఇప్పటికే ఓపెనర్‌గా ఆడిన యశస్వికి ఇప్పుడు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా, సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడిని మళ్లీ బరిలోకి దింపాలని బీసీసీఐ భావిస్తోంది. అదే సమయంలో, శుభ్‌మన్ గిల్‌ను ఇప్పుడు జట్టులోకి తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం వస్తోంది.