Rahul Dravid: 'ఖాళీ చెక్కులను' తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్.. కారణం ఏంటంటే?
టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్నారు. టీ20 ప్రపంచకప్‌తో భారత కోచ్‌గా తన పదవీకాలం ముగించిన తర్వాత, ద్రవిడ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీతో ద్రవిడ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది, ఎందుకంటే 2012-13లో ఆ జట్టును కెప్టెన్‌గా నడిపించిన ద్రవిడ్, ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు, మళ్లీ ఆ ఫ్రాంచైజీతో పని చేయనున్నారు.
బ్లాంక్ చెక్కులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఫ్రాంచైజీలు
టీమ్‌ఇండియా కోచ్‌గా విజయవంతమైన ద్రవిడ్‌ను మరెన్నో ఫ్రాంచైజీలు మెంటర్ లేదా కోచ్‌గా తీసుకోవాలని ఆశించాయి. అతనికి బ్లాంక్ చెక్కులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం, కానీ ద్రవిడ్ వాటిని తిరస్కరించారు. కష్టకాలంలో రాజస్థాన్ రాయల్స్ తనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్నందుకు కృతజ్ఞతగా ఇప్పుడు మళ్లీ టీమ్‌కు సేవలందించాలని ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2010 వరకు, రాహుల్ ద్రవిడ్ ఆర్సీబీ తరపున ఆడాడు. మూడు సీజన్లలో వరుసగా 371, 271, 256 పరుగులు చేశాడు. 2011 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో ఆర్సీబీ ద్రవిడ్ కోసం బిడ్ వేయలేదు, ఇతర ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపలేదు.
ఐపీఎల్ లో ఆటగాడిగా 471 పరుగులు
డబ్బుల విషయాన్ని పక్కన పెడితే, అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ద్రవిడ్ అవమానంగా భావించవచ్చు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ద్రవిడ్‌ను బిడ్డింగ్ చేసి, అతనికి అవకాశాన్ని ఇచ్చింది. 2011లో రాజస్థాన్ తరఫున 343 పరుగులు చేసిన ద్రవిడ్, 2012లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని 462 పరుగులు చేశాడు. 2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో కొన్ని రాజస్థాన్ ఆటగాళ్లు జీవితకాల నిషేధానికి గురైనప్పటికీ, ద్రవిడ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఆటగాడిగా 471 పరుగులు చేయడంతోపాటు, 2008 తర్వాత టీమ్‌ను మొదటిసారిగా ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. కోచ్‌గా భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ద్రవిడ్, వచ్చే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.