Rajasthan royals : మరో టైటిల్‌పై గురిపెట్టిన రాజస్థాన్ రాయల్స్..బలాలు, బలహీనతలివే..
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ ఇచ్చిన ఆనంద క్షణాలు ఇంకా అభిమానుల మదిలో సజీవంగా ఉన్నాయి. ఆ ఉత్సాహం తగ్గకముందే భారత క్రికెట్ అభిమానులను మరోసారి అలరించేందుకు ఐపీఎల్ సీజన్ సిద్ధమైంది. దేశాల మధ్య ఉన్న గీతలను చెరిపేసి, అభిమానుల మధ్య దూరాలను తొలగించి, సహచరులను ప్రత్యర్థులుగా మార్చే ఈ వేగవంతమైన క్రికెట్ లీగ్ ఇంకొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్ల బలం, బలహీనతలు, మార్పులు, అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాతి 17 సీజన్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది.
వివరాలు
మార్పులు చేశారిలా..
2022లో ఫైనల్ చేరినా రన్నరప్‌గా నిలిచింది. గత సీజన్‌లో మాత్రం జట్టు పూర్తిగా తడబడుతూ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఫ్రాంచైజీ జట్టులో గణనీయమైన మార్పులు చేసింది. ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ వైదొలగగా, డైరెక్టర్‌గా ఉన్న కుమార సంగక్కర కోచ్ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరడం ఒక పెద్ద మార్పు. గత సీజన్‌లో తాత్కాలికంగా నాయకత్వం వహించిన రియాన్ పరాగ్‌ను ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించారు. గత ఏడాది నిరాశపరిచిన హసరంగ, తీక్షణ, ఫజల్‌హక్ ఫారూఖీలను జట్టు విడుదల చేసింది. చెన్నైతో తన ప్రయాణాన్ని ముగించిన రవీంద్ర జడేజా మళ్లీ తన పాత జట్టులో చేరడం విశేషం.
వివరాలు
రాజస్థాన్ రాయల్స్ బలాలు:
అదేవిధంగా సామ్ కరన్, ఆడమ్ మిల్నే, డొనోవన్ ఫెరీరా, రవి బిష్ణోయ్ వంటి ప్రతిభావంతులు జట్టులోకి వచ్చారు. తెలుగు యువ ఆటగాడు అమన్ రావు కూడా రాయల్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఆరంభిస్తున్నాడు. సంజు శాంసన్ ఫిట్‌నెస్‌పై ఉన్న అనిశ్చితి కారణంగా అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడుతూ, కెప్టెన్సీ బాధ్యతల నుండి దూరంగా ఉన్నాడు. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న రియాన్ పరాగ్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఈసారి సంగక్కర-పరాగ్ జోడీ సమన్వయంతో పనిచేస్తుందనే నమ్మకం జట్టుకు ఉంది. పరాగ్ ఒక మంచి ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. ఈ సీజన్‌లో ఆటగాడిగా, నాయకుడిగా తన ప్రతిభను చాటాలని చూస్తున్నాడు.
వివరాలు
ఫామ్‌లోకి వస్తారా..లేదా?
ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జంట జట్టుకు బలంగా నిలుస్తోంది. గత ఐపీఎల్‌లో మెరిసిన వైభవ్ అండర్-19 స్థాయిలో కూడా తన ప్రతిభను చూపించాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టుకు ప్లస్ అవుతాడు. యశస్వి స్థిరమైన ఆటగాడు కావడంతో అతని ఫామ్‌పై సందేహం లేదు. మిడిల్ ఆర్డర్‌లో ఉండే ధ్రువ్ జురెల్, హెట్‌మయర్, లువాన్ ప్రిటోరియస్ వంటి ఆటగాళ్లు బలంగా ఉన్నారు. సామ్ కరన్, జడేజా ఆల్‌రౌండ్‌గా రాణిస్తే జట్టు ప్రదర్శన పూర్తిగా మారిపోవచ్చు. స్పిన్‌లో రవి బిష్ణోయ్ కీలక పాత్ర పోషించగలడు.
వివరాలు
బలహీనతలు ఇవే..
రాయల్స్ సాధారణంగా స్టార్ ఆటగాళ్లపై కాకుండా యువ ప్రతిభ, జట్టు సమిష్టి ఆటపై ఆధారపడుతుంది. కానీ గతంలో ఉన్నంత సమన్వయం ఇప్పుడు కనిపించడం లేదు. గత సీజన్‌లో కెప్టెన్సీ సమస్యలు జట్టును ప్రభావితం చేశాయి. పరాగ్ ప్రతిభావంతుడే అయినా, జట్టును సమర్థంగా నడిపించే నాయకత్వ లక్షణాలు అతనిలో ఎంతవరకు ఉన్నాయో అనేది సందేహంగా ఉంది. తన ప్రదర్శనతో ఆ స్థాయిని సంపాదించుకోవడం అతనికి ఒక పెద్ద సవాల్. జడేజా గొప్ప ఆటగాడే అయినా, 37 ఏళ్ల వయసులో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. బిష్ణోయ్‌కు తోడుగా మరొక నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం జట్టుకు లోపంగా మారవచ్చు. పేస్ విభాగం కూడా అంత బలంగా కనిపించడం లేదు.