
IPL 2025 : వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ మ్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు అభిమానుల్లో గట్టిన ఉత్కంఠను రేపుతుంటాయి. హోరాహోరీగా జరిగే ఆ పోరాటాలను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
అలాంటి ఆసక్తికరమైన పోరులో ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే మ్యాచ్ ఒకటి.
మొదటి సీజన్ నుంచి పోటాపోటీగా తలపడుతున్న ఈ రెండు జట్లు ఇప్పుడు 18వ సీజన్‌లో మరో కీలక పోరుకు సిద్ధమవుతున్నాయి.
మరికొన్ని గంటల్లో వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
వివరాలు
వాంఖడేలో బెంగళూరుకి ఘోరమైన రికార్డు
గత రికార్డుల ప్రకారం చూస్తే, బెంగళూరు వాంఖడే మైదానంలో గత 10 ఏళ్లుగా ఓడిపోతూనే ఉంది.
చివరిసారిగా 2015లో ముంబైపై గెలిచిన ఆర్సీబీ, ఈసారి గెలవాలనే ధృఢనిశ్చయంతో ఉంది.
మాజీ ఛాంపియన్‌ను వారి సొంత మైదానంలోనే ఓడించాలంటే, బెంగళూరు తమ సర్వశక్తులు ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
వివరాలు
2015లో కోహ్లీ, డివిలియర్స్ విజృంభణ
2015లో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను మరిచిపోవడం ఎలాగైనా కష్టం.
ఆ మ్యాచ్‌లో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.
డివిలియర్స్ 59 బంతుల్లో 133 పరుగులు చేయగా, కోహ్లీ 82 నాటౌట్‌గా రాణించాడు.
లసిత్ మలింగ, బుమ్రా వంటి బౌలర్లను ఆకాశంలోకి ఎగురవేసి 215 పరుగుల భాగస్వామ్యంతో RCBకి 235 పరుగుల భారీ స్కోర్ అందించారు.
అంతే ధీటుగా బదులిచ్చిన ముంబై కూడా 200కి పైగా పరుగులు చేసినప్పటికీ, 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
వివరాలు
ఆర్సీబీకి టాపార్డర్ మీదే భారం
ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన ఆర్సీబీ, చెపాక్‌లో 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడంతో శుభారంభం చేసింది.
అయితే, ఆ ఉత్సాహంతో హ్యాట్రిక్ గెలుపు దిశగా సాగుతుందనుకున్న వేళ గుజరాత్ టైటన్స్ చేతిలో గట్టి ఓటమి ఎదురైంది.
ప్రస్తుతం రెండు విజయాలతో, నాలుగు పాయింట్లతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో ముంబైను వాంఖడేలో ఓడించాలనే లక్ష్యంతో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది.
చెన్నైపై గెలుపు నుండి పొందిన ఆత్మవిశ్వాసంతో పది సంవత్సరాల పరాజయ శృంఖలాను ముగించాలనే కసితో ఆడనున్నారు.
వివరాలు
ముంబైకి బుమ్రా ప్లస్.. కోహ్లీపై ఆధారపడుతున్న ఆర్సీబీ
జస్ప్రీత్ బుమ్రా ఈమ్యాచ్‌లో ఆడుతుండటం ముంబై ఇండియన్స్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
పవర్ ప్లేలో అతని యార్కర్లు విజృంభిస్తే బెంగళూరుకు ఇబ్బందులు తలెత్తే అవకాశంఉంది.
అలాగే గాయం కారణంగా లక్నో మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఈసీజన్‌లో కూడా RCB ఎక్కువగా విరాట్ కోహ్లీపై ఆధారపడుతోంది.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మంచి ఆరంభాలు ఇస్తున్నా, కెప్టెన్ రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్‌లో మెరుగ్గా ఆడుతున్నా,దేవ్‌దత్ పడిక్కల్,లివింగ్‌స్టోన్,జితేశ్ శర్మ వంటి ఆటగాళ్లు నిరాశపరుస్తున్నారు.
టాపార్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ సమిష్టిగా ఆడితే తప్ప ముంబైపై భారీస్కోర్ చేయడం సాధ్యపడదు.
ఈఉత్కంఠభరిత పోరాటానికి టాస్ రాత్రి 7:00 గంటలకు వేస్తారు. మ్యాచ్ ప్రారంభం 7:30కి.