LOADING...
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా
బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన నేపథ్యంలో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై నైతిక బాధ్యత తీసుకుంటూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్‌. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రెండు మూడు రోజుల్లో అనూహ్యమైన ఘటనలు జరిగాయి. వాటిలో మా పాత్ర పరిమితంగానే ఉంది.

Details

ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు

నైతికంగా బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేస్తున్నాం. మా రాజీనామా లేఖలను కేఎస్‌సీఏ అధ్యక్షుడికి పంపామని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ నిఖిల్ సొసలె, డీఎన్ఏ సంస్థకు చెందిన సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్‌లను అరెస్టు చేశారు.

Details

ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ సంఘం

మరోవైపు ఈ కేసు కోర్టు చుట్టూ తిరుగుతోంది. తమపై నమోదైన కేసు రద్దు చేయాలంటూ కర్ణాటక క్రికెట్ సంఘం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తమపై బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ 13కు వాయిదా వేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బెంగళూరు నగర కమిషనర్‌ బి.దయానంద్‌ సస్పెండ్‌ అయ్యారు. అలాగే సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిను కూడా ప్రభుత్వ సేవల నుంచి తొలగించారు. మరికొందరు అధికారులను బదిలీ చేస్తూ చర్యలు కొనసాగుతున్నాయి.