Richest Indian cricketer: టీమిండియాలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తుల నికర విలువ ఎంతంటే..?
సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో ఒక ఎవరెస్ట్ శిఖరమై నిలిచాడు. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మాస్టర్ బ్లాస్టర్,2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటకు వీడ్కోలు పలికినా,సచిన్ సాధించిన రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. టెస్ట్,వన్డేల్లో అత్యధిక పరుగులు,అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఆయన అసాధారణమైన స్థాయిలో ఉన్నాడు.అందుకే సచిన్‌ను ఫ్యాన్స్"క్రికెట్ దేవుడు"గా పిలుస్తారు. కేవలం ఆటలోనే కాదు,సంపాదనలో కూడా సచిన్ తన సత్తా చాటుతున్నాడు. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో సచిన్ ఒకరిగా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ నికర ఆస్తుల విలువ రూ.1400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ సంపదతో ఆయన విరాట్ కోహ్లి,ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి ఇతర క్రికెటర్లకన్నా ముందున్నారు.
ఎండార్స్‌మెంట్స్‌తో భారీగా ఆదాయం
సచిన్ ఆదాయం ప్రధానంగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ నుంచే వస్తుంది. సచిన్ క్రేజ్ తగ్గకపోవడం వలన, అతనితో అనేక కంపెనీలు ఎండార్స్‌మెంట్ చేయడం కొనసాగిస్తున్నాయి. లుమినస్, బూస్ట్, అన్‌అకాడమీ వంటి ప్రముఖ బ్రాండ్స్‌కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్ తన కెరీర్‌లో 200 టెస్ట్‌లు ఆడాడు,15,921 పరుగులు సాధించి 51 సెంచరీలు,68 హాఫ్ సెంచరీలు చేసాడు. వన్డేల్లో 463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులతో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా ఆయనే. ఇప్పుడు సచిన్ మరోసారి మైదానంలోకి రాబోతున్నాడు. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML)-2024లో సచిన్ ఇండియా తరపున ఆడనున్నారు.