Page Loader
Rohit Sharma: టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!
టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!

Rohit Sharma: టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టు ఫామ్‌ను కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన రోహిత్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదో టెస్టు తరువాత అతను తన టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ నిర్ణయం తెలుసుకున్న బీసీసీఐ, సెలక్టర్లు రోహిత్‌తో మాట్లాడారు. కానీ అతను తన నిర్ణయాన్ని మార్చుకోనట్లుగా తెలుస్తోంది.

Details

ఐదో టెస్టులో తప్పక గెలవాలి

అయితే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్‌ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ ఫైనల్‌కు చేరాలంటే, సిడ్నీలో జరగబోయే ఐదో టెస్టులో తప్పక గెలవాల్సి ఉంది. అయితే ఓడినా లేదా డ్రా అయినా, భారత్ ఫైనల్ రేసు నుండి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్టులో గెలిస్తే, భారత్ ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. జనవరి చివరలో ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 2-0తో గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక ఆస్ట్రేలియా మిగిలిన మూడు టెస్టులలో (భారత్‌తో 1, శ్రీలంకతో 2) ఒక్కటి గెలిస్తే కూడా ఫైనల్‌కు చేరిపోతుంది.