
Wankhede Stadium heist: బీసీసీఐ ఆఫీసులో దొంగతనం.. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలను దొంగిలించిన సెక్యూరిటీ గార్డు..
ఈ వార్తాకథనం ఏంటి
వాంఖడే స్టేడియంలో రెండో అంతస్తులో ఉన్న బీసీసీఐ స్టోర్ రూమ్ నుంచి మొత్తం 261 ఐపీఎల్ అధికారిక జెర్సీలను ఒక సెక్యూరిటీ గార్డు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ జెర్సీల విలువ సుమారుగా రూ.6.52 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ చోరీ జూన్ 13న జరిగినా, బీసీసీఐ ఉద్యోగి హేమాంగ్ భరత్ కుమార్ అమీన్ జూలై 17న పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత మాత్రమే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో మెరైన్ డ్రైవ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత - 2023లోని సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 40 ఏళ్ల ఫారూక్ అస్లామ్ ఖాన్‌గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు
సీసీటీవీ ఫుటేజ్'లో సెక్యూరిటీ గార్డు..
పోలీసుల వివరాల ప్రకారం,ఈ జెర్సీల దొంగతనం జూన్ 13న జరిగినా,బీసీసీఐ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన స్టాక్ ఆడిట్ సమయంలో ఇది బయటపడింది. ఆడిట్ సమయంలో కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా,సెక్యూరిటీ గార్డు ఫారూక్ అస్లామ్ ఖాన్ పెద్ద కార్డ్‌బోర్డ్ బాక్స్‌ను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు కన్పించాయి. ఆ తరువాత అతడు హర్యానాకు చెందిన ఓ ఆన్‌లైన్ జెర్సీ డీలర్‌తో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వాటిని విక్రయించాడు. తాను తీసిన జెర్సీలను అతడికి కొరియర్ ద్వారా పంపించాడు.అయితే వీటి విక్రయ ధర ఎంత అన్న విషయాన్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఫారూక్ అస్లామ్ ఖాన్ తనకు వచ్చిన డబ్బును ఆన్‌లైన్ జూదంలో ఖర్చు చేశానని విచారణలో ఒప్పుకున్నాడు.
వివరాలు
50 జెర్సీల స్వాధీనం
ప్రస్తుతం అతని బ్యాంకు లావాదేవీలను పోలీసులు శోధిస్తున్నారు. ఇవే జెర్సీలు ఐపీఎల్‌లో పాల్గొనే 10 జట్లకు చెందినవని సమాచారం. అయితే వీటిని ఆటగాళ్ల కోసం ఉంచినవా లేదా అభిమానుల కోసం సిద్ధం చేసినవా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇక హర్యానాకు చెందిన ఆన్‌లైన్ డీలర్‌ను కూడా పోలీసులు విచారించారు. జెర్సీలు దొంగిలించబడినవన్న విషయం తనకు తెలియదని, బీసీసీఐ కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా విక్రయించినట్లు సెక్యూరిటీ గార్డు చెప్పాడని ఆ డీలర్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటివరకు పోలీసులు కేవలం 50 జెర్సీలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.