Shammi Silva: జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా
కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. జై షా స్థానంలో శ్రీలంక క్రికెటర్ షమ్మీ సిల్వా ఏసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. షమ్మీ సిల్వా గతంలో ఆయన ఏసీసీ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్‌గానూ సేవలందించారు. అంతేకాకుండా మూడు సార్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా షమ్మీ సిల్వా ఒక ప్రకటన విడుదల చేశారు.
సభ్యదేశాలను ఐక్యంగా ఉంచడమే తన ప్రధాన లక్ష్యం
ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం తన జీవితంలో గౌరవప్రదమైన ఘట్టమని, క్రికెట్ అనేది ఆసియాలోని ప్రజల గుండె చప్పుడులాంటిదని పేర్కొన్నారు. క్రికెట్ అభివృద్ధి, కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించడం, సభ్య దేశాలను ఐక్యంగా ఉంచడం తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. షమ్మీ సిల్వా అధ్యక్షతను ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశాలు శుభాకాంక్షలతో స్వాగతించాయి. ఆయన నాయకత్వంలో ఆసియా క్రికెట్ మరింత పుంజుకుంటుందని, ఆటగాళ్లకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.