
Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ షాక్..భారీ జరిమానా..
ఈ వార్తాకథనం ఏంటి
ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు ముగిశాయి.
బుధవారం చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి చెందడంతో, అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌ను పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ విజయంలో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.
అయితే మ్యాచ్ అనంతరం అతనికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. మెల్లగా ఓవర్లు వేసిన కారణంగా బీసీసీఐ అతనిపై రూ.12 లక్షల జరిమానా విధించింది.
వివరాలు
చాహల్ నాలుగు వికెట్లు
మ్యాచ్ విషయానికి వస్తే..చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 19.2 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది.
బ్యాటింగ్‌లో సామ్ కర్రాన్ అత్యుత్తమంగా రాణించి 47 బంతుల్లో 88 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేశాడు.
అతడికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ 32 పరుగులు చేశాడు.పంజాబ్ బౌలింగ్ విభాగంలో చాహల్ నాలుగు వికెట్లు తీశాడు.
అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సన్ చెరో రెండు వికెట్లు తీసారు.
హర్ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా తలో ఓ వికెట్ తీసుకున్నారు.
పంజాబ్ జట్టు 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
వివరాలు
పంజాబ్ జట్టు స్లోఓవర్ రేట్ నమోదు
ప్రభ్ సిమ్రాన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులతో మెరిశాడు. వీరిద్దరి హాఫ్ సెంచరీలతో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణా చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లోఓవర్ రేట్‌ను నమోదుచేసింది. నిర్ణీత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోవడంతో బీసీసీఐ, కెప్టెన్ అయ్యర్‌పై జరిమానా విధించింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ జట్టు ఈ తప్పును చేసిన మొదటి ఘటన ఇదే కావడంతో, బీసీసీఐ ప్రకటనలో రూ.12 లక్షల జరిమానాను పేర్కొంది.
వివరాలు
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్
చెన్నైపై ఈ విజయం ద్వారా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
ఇప్పటివరకు పంజాబ్ 10 మ్యాచ్‌లు ఆడగా, ఆందులో 6 గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది,
మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 13 పాయింట్లు ఉండగా, నెట్ రన్‌రేట్ +0.199గా ఉంది.
లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, అందులో కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.