LOADING...
Gill-Kishan: గిల్-కిషన్‌ జోడీ అదరగొట్టింది.. ప్రపంచకప్‌ లక్ష్యానికి పక్కా బ్లూప్రింట్
గిల్-కిషన్‌ జోడీ అదరగొట్టింది.. ప్రపంచకప్‌ లక్ష్యానికి పక్కా బ్లూప్రింట్

Gill-Kishan: గిల్-కిషన్‌ జోడీ అదరగొట్టింది.. ప్రపంచకప్‌ లక్ష్యానికి పక్కా బ్లూప్రింట్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 18, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే క్రికెట్‌లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కలయిక ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మరోసారి రుజువైంది. యువ ఆటగాళ్లు శుభమన్ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ అద్భుత శతకాలతో చెలరేగి భారత్‌కు భారీ స్కోరు అందించడమే కాకుండా.. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టు బ్యాటింగ్‌ కూర్పు ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. టీ20 ఫార్మాట్‌లో ఎడమచేతి బ్యాటర్లకు ప్రాధాన్యం ఇస్తున్న భారత జట్టు యాజమాన్యం.. వన్డేల్లో మాత్రం ఇప్పటివరకు ఎక్కువగా కుడిచేతి బ్యాటర్లపైనే ఆధారపడింది. ఈసారి విరాట్‌ కోహ్లీ గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇషాన్‌ కిషన్‌ను మూడో స్థానంలో, యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా జట్టు మేనేజ్‌మెంట్‌ బరిలోకి దించింది.

వివరాలు

ఇద్దరూ అదరగొట్టారిలా..

జైస్వాల్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరినా.. అనంతరం గిల్‌, కిషన్‌ ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. ఎకానా స్టేడియంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. ఇద్దరూ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. మొదటి వన్డేలో ఆకట్టుకున్న శుభ్‌మన్‌ గిల్‌.. రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. కేవలం 110 బంతుల్లోనే 154 పరుగులు సాధించి తన క్లాస్‌ను మరోసారి చాటిచెప్పాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి వన్డే శతకం కావడం విశేషం.

వివరాలు

ఆ జోడీని గుర్తుచేసిన ఇషాన్..గిల్

గిల్‌ కవర్‌డ్రైవ్‌లు, పుల్‌ షాట్లు, ఫ్లిక్‌లతో తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే.. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన అతడు.. తర్వాత వేగం పెంచి కేవలం 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 125 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. ఈ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. గిల్‌-కిషన్‌ కలిసి నెలకొల్పిన 224 పరుగుల భాగస్వామ్యం.. భారత వన్డే చరిత్రలో మూడో వికెట్‌కు నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌-సచిన్‌ టెండూల్కర్‌ జోడీ 237 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement

వివరాలు

2027 ప్రపంచకప్‌‌కు సన్నాహకాలు..

ఈ మ్యాచ్‌లో గిల్‌, కిషన్‌ భాగస్వామ్యం కేవలం భారీ పరుగులకే పరిమితం కాలేదు. ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కలయిక కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్లు తమ లైన్‌, లెంగ్త్‌ను పదేపదే మార్చాల్సి వచ్చింది. ఫీల్డ్‌ సెట్టింగ్‌లలోనూ వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇద్దరి ఆటతీరు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. స్కోరింగ్‌ వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. చివరి ఓవర్లలో భారత మిడిలార్డర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. గిల్‌, కిషన్‌ నిర్మించిన భాగస్వామ్యం మాత్రం జట్టు యాజమాన్యానికి కీలక సందేశాన్ని అందించింది. 2027 ప్రపంచకప్‌ సన్నాహకాలు ప్రారంభమైన ఈ దశలో.. లక్నోలో ఆ ఇద్దరూ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ భారత జట్టు భవిష్యత్‌ బ్యాటింగ్‌ వ్యూహానికి నాంది పలికిన ప్రదర్శనగా గుర్తుండిపోయే అవకాశం ఉంది.

Advertisement