SL vs Pak: అరుదైన మైలురాయిని చేరుకున్న ధనంజయ డి సిల్వా
శ్రీలంక బ్యాటర్ ధనంజయ డి సిల్వా అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచులో ధనంజయ డి సిల్వా 68 బంతుల్లో 57 పరుగులు సాధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 7500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ధనంజయ డి సిల్వా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచులో శ్రీలంక 36 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో దినేష్ చండిమాల్(34)తో కలిసి ధనంజయ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 85 పరుగులను జోడించారు.
ధనుంజయ సాధించిన రికార్డులివే
ఇప్పటివరకూ 117 ఎఫ్‌సి మ్యాచుల్లో ధనుంజయ 7511 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలను బాదాడు. ఇక అంతర్జాతీయ టెస్టుల్లో 51 మ్యాచులు ఆడి 40.13 సగటుతో 3291 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు, 10 సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో 56.91 సగటుతో 34 వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆరు టెస్టుల్లో అతను 63.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 166 పరుగులకే అలౌటైంది.