ఐపీఎల్ 2023లో స్పాట్ ఫిక్సింగ్ క్రికెటర్.. పదేళ్ల తర్వాత శ్రీశాంత్ ఎంట్రీ
ఐపీఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభ కానుంది. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లాంటి నేరగానికి పాల్పడి క్రికెట్ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్‌లో శ్రీశాంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాకపోతే శ్రీశాంత్ ఈసారి ఎప్పటిలా మైదానంలోకి ఎంట్రీ లేదు. ఈ సీజన్‌కు అతడు కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో శ్రీశాంత్ ను హర్భజన్ చెంప దెబ్బ కొట్టడంతో స్టేడియంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే హర్భజన్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది. అయితే వివాదం తర్వాత వీరిద్దరు కలిసి కామెంటేటరీ అందించబోతుండటం ఆసక్తికరంగా మారింది.
కామెంటరీ ప్యానల్‌లో శ్రీశాంత్ పేరు
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నిషేధానికి గురైన శ్రీశాంత్ దాదాపు పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. 2013లో రాజస్థాన్ రాయల్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపిఎల్ 2023 అధికారిక టెలికాస్ట్ పార్ట్‌నర్ అయిన స్టార్‌స్పోర్ట్స్, స్టార్ ప్లేయర్స్ తో కూడిన కామెంటేటర్స్ ప్యానెల్ జాబితాను ప్రకటించింది. ఈ కామెంటరీ ప్యానెల్‌లో టీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పేరు ఉంది. గతంలో మాదిరిగా బంతి చేతపట్టుకొని కాకుండా ఈసారి మైక్ చేతపట్టుకొని శ్రీశాంత్ కనిపించనున్నాడు.