
IND vs ENG: ఇంగ్లాండ్‌తో 4వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్'తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబాటులో ఉంది. ఇప్పటికే ముగిసిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత జట్టులో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. కేవలం 193 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. లార్డ్స్ టెస్ట్‌లో ఓటమి అనంతరం గిల్ సేనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియా మరో కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జూలై 23నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఈ తరుణంలో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
గాయం అనంతరం అర్ష్‌దీప్ ఎడమ చేతికి బ్యాండేజ్
టీమిండియాకు కీలకమైన పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. గురువారం నెట్స్‌లో సాధన చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్యాటర్ సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో అర్ష్‌దీప్ చేతికి తీవ్ర గాయం జరిగింది. వెంటనే ఫిజియో వచ్చి అతని వేలికి టేప్ పెట్టి, వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అర్ష్‌దీప్ గాయం ఎలా ఉందన్న విషయంపై స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అయితే చేతికి కుట్లు పడినట్లయితే.. కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని టీమిండియా సహాయ కోచ్ టెన్ డస్కాటె వెల్లడించాడు. గాయం అనంతరం అర్ష్‌దీప్ ఎడమ చేతికి బ్యాండేజ్ వేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాలు
ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయని అర్ష్‌దీప్
ఇక ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అర్ష్‌దీప్‌కు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే జస్ప్రీత్ బుమ్రా లేదా మరొక ఫాస్ట్ బౌలర్ విశ్రాంతి తీసుకున్నట్లయితే.. అర్ష్‌దీప్‌ను మాంచెస్టర్ టెస్ట్ కోసం తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉండేదని భావిస్తున్నారు. కానీ, ఈ నేపథ్యంలో అతడు గాయపడటంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర ఆందోళనకు గురయ్యింది. ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనప్పటికీ.. అర్ష్‌దీప్ టీ20ల్లో గొప్ప ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటివరకు 63 టీ20 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీశాడు. అలాగే 26 ఏళ్ల అర్ష్‌దీప్ వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు. 9 వన్డేల్లో 14 వికెట్లు పడగొట్టాడు.