IPL 2026: ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ల నిర్లక్ష్యం.. గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్న తరుణంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విదేశీ ఆటగాళ్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విదేశీ స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలను, అలాగే భారతదేశం అందించే ఆతిథ్యాన్ని సరైన స్థాయిలో గౌరవించడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది వేలం ముందు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చే ఈ ఆటగాళ్లు, టోర్నమెంట్ ప్రారంభానికి దగ్గరగా గాయాలు లేదా వ్యక్తిగత కారణాలు చూపిస్తూ తప్పుకోవడం లేదా ఆలస్యంగా జట్టుతో కలవడం అలవాటుగా మారిందని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
అలా చేస్తే జట్లపై ఎఫెక్ట్
ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తాయని గవాస్కర్ గుర్తు చేశారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా వారితో కలిసి ఉండేందుకు అయ్యే ఖర్చులను జట్లు భరిస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే, ఈ సదుపాయాలను కొందరు విదేశీ ఆటగాళ్లు తమ హక్కులుగా భావిస్తూ, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలంలో జట్లు ఎంతో ఆలోచించి, వ్యూహాత్మకంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తాయని, కానీ చివరి నిమిషంలో వారు అందుబాటులో లేకపోవడం వల్ల జట్టు ప్రణాళికలు పూర్తిగా దెబ్బతింటాయని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
ఈ సీజన్‌లో ఆలస్యంగా చేరనున్న స్టార్ ఆటగాళ్లు
ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రముఖ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ కారణాల వల్ల తమ తమ జట్లతో ఆలస్యంగా చేరనున్నట్లు సమాచారం. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఇలాంటి ఆటగాళ్ల గురించేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మార్చి 28 నుంచి మే 31వ తేది వరకు జరుగనున్న ఈ ఐపీఎల్ మహోత్సవాన్ని చూడటానికి క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.